పేదలను దోచుకునే ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేయాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలు, పోలీసు నిర్బంధాలు, అరెస్టుల మధ్య తెలంగాణలో కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో చాలా జిల్లాల్లో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.కొన్ని చోట్ల కార్యకర్తలను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో పలువురు గాయపడ్డారు. అంతటా నేతల అరెస్టులు కొనసాగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నేతలు బంగారు శ్రుతి, శ్రీధర్ రెడ్డి, గౌతంరావు, శ్యాంసుందర్ గౌడ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కు చెందిన దుర్గా అనే కార్యకర్త కలెక్టరేట్ వద్ద చింత చెట్టు ఎక్కి కొద్ది సేపు హల్ చల్ చేశాడు. తర్వాత నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇక సిద్దిపేట కలెక్టరేట్ ముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, గద్వాలలో డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ధర్నా చేశారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో కార్యకర్తలను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓ కార్పొరేటర్‌ను ఏసీపీ అశోక్ అడ్డుకుని తిట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నల్గొండలో కలెక్టర్ చాంబర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప లాఠీచార్జ్ చేశారు. జనగామలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చి భవన అద్దాలను ధ్వంసం చేశారు. మహబూబ్ నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ధర్నాలు చేసింది.
గడీకి పరిమితమైన సీఎం కేసీఆర్ కు ప్రజల గోడు పట్టడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పౌరులు తమ హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం అమానవీయమని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, మంత్రులు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పోలీసుల నిర్బంధాలు, ముందస్తు అరెస్టులను చేధించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట కార్యకర్తలు, నాయకులు ధర్నాలు చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారని సంజయ్ కొనియాడారు.
టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనను వ్యక్తం చేసిన పార్టీ క్యాడర్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. బీజేపీ ఇచ్చిన పిలుపును విఫలం చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి నుంచే అరెస్టులు చేశారని, ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేశారని దుయ్యబట్టారు.
పోలీసుల సాయంతో ప్రజాస్వామిక విలువలు, హక్కులను టీఆర్ఎస్ సర్కార్ కాలరాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన సాగుతోందా, లేక పోలీసు రాజ్యం నడుస్తోందా అనే అనుమానం కలుగుతోందని ధ్వజమెత్తారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!