బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే

దాదాపు 50ఏళ్లుగా రాజకీయాల్లో వుంటున్న మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగించిన నష్టం అపారమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ విమర్శించారు. నవంబరు 3న జరిగే ఎన్నికల్లో బిడెన్‌ విజయం సాధించినట్లైతే అది చైనాకు విజయమని ఆయన ప్రజలను హెచ్చరించారు. 
 
”గత 47ఏళ్ళ కాలంలో బిడెన్‌ మీ ఉద్యోగాలన్నింటినీ చైనాకు, ఇతర విదేశాలకు తరలించారు, మీక్కూడ అది తెలుసు, నేను గత నాలుగేళ్లుగా ఆ ఉద్యోగాలన్నింటినీ తిరిగి మన దేశానికి తేవడానికి కృషి చేస్తున్నాను.” అని ట్రంప్‌ ఓహియోలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఈ అధ్యక్ష ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయనతెలిపారు. 
 
”సమున్నత ఎత్తులకుమన దేశాన్ని తీసుకెళ్ళాలా లేక మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చేందుకు ఈ బిడెన్‌ను అనుమతించాలా అనేది అమెరికన్లు తేల్చుకోవాల్సిన రోజు నవంబరు 3” అని ఆయన పేర్కొన్నారు.
 
దాదాపు 40లక్షల కోట్ల డాలర్ల మేరకు పన్నులను పెంచే, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగాలను చైనాకు, మీరెన్నడూ పేరు కూడా వినని దేశాలకు తరలించడానికి ఆత్రుత పడుతున్న బిడెన్‌ను గెలిపించుకోవాలా వద్దాతేల్చుకోవాల్సింది ప్రజలేనని స్పష్టం చేశారు. 
 
సంపన్న వర్గాలపై భారాన్ని పెంచేలా వచ్చే నాలుగు దశాబ్దాల్లో 40లక్షల కోట్ల డాలర్ల పన్నులను దశలవారీగా పెంచాలన్నది డెమోక్రాట్ల ప్రతిపాదనగా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లే, మనం గెలిస్తే, అమెరికా గెలిచినట్లని ట్రంప్‌ చెప్పారు. 
 
అమెరికాకు ఎవరు అత్యధిక ప్రాధాన్యతనిస్తారో వారికే మీరు ఓటేయండని ఆయన కోరారు. కరోనా ముప్పుతో నిమిత్తం లేకుండా గత రెండు వారాల్లో పలు ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్‌ పాల్గన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే వేలాదిమంది ప్రజలు ఈ ర్యాలీలకు హాజరువుతున్నారు. మూర్ఖత్వానికి వ్యతిరేకంగా తెలిపే నిరసన ఇదని ఆ ర్యాలీలను ట్రంప్‌ అభివర్ణించారు.  
 
ఇలా ఉండగా, అమెరికా ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన రూ 3.43 వేల కోట్లు (466 మిలియన్ డాలర్లు) విరాళాలు సేకరించారు. దేశా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్‌కు రూ  2.39 వేల కోట్లు (325 మిలియన్ డాలర్లు) మాత్రమే విరాళాలు అందాయి.