టైమ్స్‌ ప్రభావవంతమైన వ్యక్తిగా నరేంద్ర మోదీ  

అమెరికా టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చేర్చింది. జాబితాలో చోటుదక్కిన వంద మందిలో బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఒక్కరే ఉండటం  విశేషం.
అయితే ఇదే సమయంలో చాలా పదునైన వ్యాఖ్యలు కూడా చేసింది. టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన జాబితాలో చైనా అధినేత జి జిన్‌పింగ్‌ కూడా చోటు దక్కించుకున్నారు. ఆయనతోపాటు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా జాబితాలో ఉన్నారు.
 ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్య అభ్యర్థులుగా నిలిచిన జో బిడెన్‌, కమలాదేవి హారిస్‌తోపాటు యూఎస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ క్లినికల్‌  మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ రవీంద్ర గుప్తాలు కూడా ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు.
100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోదీని చేర్చిన టైమ్స్‌ మ్యాగజైన్‌.. ఇదే సమయంలో ఆయనపై పదునైన వ్యాఖ్యలు కూడా చేసింది. భారతదేశంలోని 1.3 బిలియన్ జనాభాలో క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతర మతాల ప్రజలు ఉన్నారని టైమ్స్‌ మ్యాగజైన్‌ ఎడిటర్ కార్ల్ విక్ రాశారు.
ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ ప్రాంతంలో పౌరసత్వ చట్టం (సిఏఏ) కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్న 82 ఏండ్ల బిల్కిస్ బానోను కూడా టైమ్స్‌ జాబితాలో చేర్చారు. భారతీయ మూలాలున్న సుందర్‌ పిచాయ్ పేరును కూడా టైమ్స్‌ తన ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది.
భారతదేశం నుంచి అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లి ట్రిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో కావడం వరకు అతని కథ ప్రత్యేకమైనదని టైమ్స్‌ మ్యాగజైన్‌ కొనియాడింది.