కాశ్మీర్ విషయంలో జోక్యాన్ని సహించబోం

టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌‌పై భారత్ మండిపడింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌‌జీఏ)లో చర్చ సందర్భంగా కాశ్మీర్‌‌‌‌పై ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. 
 
భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ‘దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పాలంటే కీలకమైన కాశ్మీర్ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది’ అని ఎర్డోగన్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఎన్‌‌లో భారత్ పార్లమెంట్ ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి దీనిపై ఓ ట్వీట్ చేశారు. 
 
‘భారత్ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌‌పై టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను గమనించాం. భారత అంతర్గత వ్యవహరాల్లో స్థూల జోక్యం చేసుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడాన్ని టర్కీ నేర్చుకోవాలి. అలాగే తన సొంత విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి’ అని తిరుమూర్తి ట్వీట్ చేశారు.
 
పాకిస్థాన్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న ట‌ర్కీ అధ్యక్షుడు ఎర్డ‌గోన్‌.. గ‌త ఏడాది కూడా క‌శ్మీర్ అంశాన్ని త‌న సందేశంలో ప్ర‌స్తావించారు. ఇండోపాక్ స‌మ‌స్య‌పై మూడ‌వ దేశ ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని గ‌తంలో ప‌లుమార్లు ఇండియా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.