చైనా చొరబాట్లపై నేపాల్‌లో నిరసనలు  

భారత ఉపఖండంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించి భంగపడ్డ చైనా ఇప్పుడు తమ పాచికను నేపాల్‌పై విసిరేందుకు సిద్ధమైంది. సరిహద్దులోని నేపాల్ భూభాగంలో ఏకపక్షంగా 11 భవనాలను నిర్మించడంతో చైనాపై నేపాల్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తర హమ్లా జిల్లాతోపాటు ఖట్మండులోని చైనా ఎంబసీ కార్యాలయం వద్ద నేపాలీయులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో నేపాల్ జనం రోడ్లపైకి వచ్చి చైనా ఆక్రమణలను ఎంతమాత్రమూ సహించేది లేదంటూ నినాదాలు చేశారు.

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులోని ఉత్తర హమ్లా జిల్లా నేపాల్‌ సరిహద్దులో చైనా చొరబాటుకు నిరసనగా ‘బ్యాక్ ఆఫ్ చైనా’ బ్యానర్‌లతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తమ ప్రభుత్వానికి తెలియకుండానే 11 భవనాలను నిర్మించడం ఆక్రమణే అవుతుందని నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తర హమ్లా జిల్లాతో పాటు ఖట్మండులోని చైనా రాయబార కార్యాలయం వద్ద కూడా నేపాల్‌ ప్రజలు నిరసన తెలిపారు. చైనా భవనాలు నిర్మించిన లాప్చాలోని ప్రజలు దీనిని హమ్లా పరిపాలన అధికారుల దృష్టికి తీసుకువచ్చారని స్థానికులు తెలిపారు. 

జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవడం కష్టంతో కూడుకున్నపని. అందువల్ల చైనా సైన్యం శాశ్వత భవంతులను నిర్మించిందని వారు చెప్తున్నారు. 

లాప్చాలోని స్థానికులు భవనాల గురించి సమస్యను లేవనెత్తిన తరువాత, సరిహద్దు ప్రాంతాలను కూడా సందర్శించకుండా చైనీయులు తమను బెదిరించారని వారు పేర్కొన్నారు. దాంతో నేపాల్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను వివాదాస్పద భూమికి పంపి విచారణ జరుపాల్సిందిగా ఆదేశించింది.

నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికారులు తమ నివేదికను ఇంకా సమర్పించనప్పటికీ.. ఈ విషయాన్ని పరిపాలన దృష్టికి తీసుకువచ్చిన నామ్ఖా గ్రామీణ మునిసిపాలిటీ చైర్మన్ బిష్ణు బహదూర్ లామా,  స్థానికులతో సంభాషించారు. 

“చైనీయులు కొవిడ్ మహమ్మారి కారణంగా ముఖాముఖి చర్చలు జరుపడం సాధ్యం కాదని చెప్పారని, 11 భవనాలు నిర్మించిన స్థలాన్ని విడిచిపెట్టమని కోరాం”అని బిష్ణు బహదూర్‌ లామా చెప్పారు.

నేపాలీ అధికారుల సమాచారం మేరకు, ఎనిమిది సంవత్సరాల క్రితం రహదారి నిర్మాణ ప్రక్రియలో సరిహద్దు స్తంభాల సంఖ్య 11 దెబ్బతిన్నది. అప్పటి నుంచి వాటిని భర్తీ చేయలేదు. ఇప్పుడు చైనా వైపు నేపాల్ నిర్లక్ష్యాన్ని ఆసరగా చేసుకుని సరిహద్దు వెంబడి ఉన్న క్లిష్టమైన పాయింట్‌ను సద్వినియోగం చేసుకున్నట్లు కనిపిస్తున్నది.

చైనీయులు వాదించే భూభాగం తమదేనని స్థానికులు పేర్కొంటున్నారు. “ఈ భూభాగం మాకు చెందినది. దీనిని నేపాల్ గతంలో అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. ఇది ప్రాథమికంగా రెండు వైపులా మేత కోసం ఉపయోగించబడింది” అని  లామా తెలిపారు.