దేశం అంతటా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా భిన్నధృవాలు. ముగ్గురు కలసి రాజకీయ అంశాలపై ఒకే వేదికపైకి వచ్చిన సందర్భాలు దాదాపు లేనేలేవు. కానీ దేశ సరిహద్దు లడఖ్ లో మాత్రం ఈ మూడు పార్టీలు ఇప్పుడు ఒకే పల్లవి అందుకున్నాయి.
త్వరలో జరుగనున్న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
గత ఏడాదే కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన లడఖ్ లో ఈ కౌన్సిల్ ను అస్సాంలోని బోడో టెర్రిటోరియల్ కౌన్సిల్ తరహాలో ఆరవ షెడ్యూల్ లో చేర్చాలని అంటూ స్థానిక సామజిక – ధార్మిక సంస్థలతో కలిసి డిమాండ్ చేస్తున్నాయి.
రాజకీయ పార్టీలు, సాంస్కృతిక – ధార్మిక సంస్థలు ఈ మేరకు ఉమ్మడిగా ఇచ్చిన ప్రకటనపై ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా సంతకం చేశారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
గత ఏడాది ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎ ని రద్దు చేసిన అనంతరం లడఖ్ ప్రాంతంలో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వలస వచ్చి, తమ ఉనికికి భంగం వాటిల్లింప చేస్తారేమో అని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అందుకనే రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లో చేర్చాలనే డిమాండ్ తో `లడఖ్ కు 6వ షెడ్యూల్కు ప్రజా ఉద్యమం’ అని ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. వీరు జారీ చేసిన ప్రకటనలు వివిధ రాజకీయ పక్షాలు, సాంస్కృతిక-ధార్మిక సంస్థలకు చెందిన 12 మంది సంతకాలు చేశారు.
సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్, బిజెపి, లడఖ్ బుద్ధిష్ట్ అసోసియేషన్, అల్ లడఖ్ గోనెప అసోసియేషన్, అంజుమన్-ఇ-మొయిన్-ఉల్-ఇస్లాం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులతో పాటు ఇతరులు ఉన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371, 6వ షెడ్యూల్, స్థానిక చట్టాల క్రింద స్థానిక గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 3న లడఖ్ లోని బిజెపి ఒక తీర్మానం ఆమోదించింది. లడఖ్ కౌన్సిల్ ఎన్నికలు అక్టోబర్ 16న జరుగవలసి ఉంది.
30 మంది సభ్యులు గల ఈ కౌన్సిల్ లో 26 స్థానాలకు ఎన్నికలు జరిగితే, నలుగురిని నామినేట్ చేస్తారు. అంతకు ముందు సరిహద్దులో ఉద్రిక్తలు, కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలను వాయిదా వేయమని కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ కోరారు.
పివి నరసింహారావు హయాంలో లేహ్ కేంద్రంగా ఈ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, మొదటిసారిగా 1995లో ఎన్నికలు జరిపారు. ఆ తర్వాత ముఫ్తి మొహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పిడిపి అధికారంలో ఉన్నప్పుడు 2003లో ఎన్నికలు జరిగాయి. 2003లో కార్గిల్ జిల్లాకు సహితం ఇటువంటి స్వతంత్ర ప్రతిపత్తిగల కౌన్సిల్ ను వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!