హొర్ముజ్ జలసంధి వద్ద నెలల తరబడి సరుకులతో చిక్కుకుపోయి ఉన్న నౌకల్లోని సిబ్బందికి మానవతా చర్యగా సహాయం అందించేందుకు ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’ను నిర్వహించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సముద్ర ఆపరేషన్ ద్వారా ఇరాన్ చర్యతో హొర్ముజ్ వద్ద చాలాకాలంగా చిక్కుకుపోయిన నౌకలకు అమెరికా రక్షణగా నిలిచి మార్గదర్శనం చేస్తూ జలసంధిని దాటిస్తుందని చెప్పారు.
“ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఓడలు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని మమ్మల్ని అభ్యర్థించాయి. మేము వాటిని సురక్షితంగా గైడ్ చేస్తాం. ఈ ప్రక్రియలో ఎవరైనా అడ్డుపడితే బలప్రయోగం చేసి ఎదుర్కొంటాం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. ఈ ప్లాన్ ప్రకారం నిష్పాక్షిక దేశాల ఓడలను మాత్రమే సహాయం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ ఆపరేషన్‌లో గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు, వందకి పైగా విమానాలు, డ్రోన్లు, 15,000 మంది సైనికులు పాల్గొంటారు. ఇది పూర్తి ఎస్కార్ట్ మిషన్ కాదని, గైడెన్స్, కోఆర్డినేషన్ ఆధారితమని అధికారులు చెప్పారు. విశ్లేషకులు మాత్రం ఈ ప్లాన్ ను కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనగా విమర్శిస్తున్నారు. ఈ ప్లాన్ తో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ యుద్ధం ముగింపునకు చాలా సానుకూల చర్చలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ చర్య పూర్తిగా మానవతా దృష్టితో చేపట్టినదేనని ఆయన వివరించారు. ‘ఈ నౌకలలో చాలా వాటిలో ఆహారం, అవసరమైన సరఫరాలు కొరతగా ఉన్నాయి. సిబ్బంది ఆరోగ్యానికి ఇది ప్రమాదకరం. ఈ చర్యతో సానుభూతి, మంచి సంకల్పం కనిపిస్తుంది’ అని ‘ట్రంప్ చెప్పారు.
కాగా, హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశిస్తే అమెరికా బలగాలపై దాడి చేస్తామని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరిక చేసింది. హొర్ముజ్ జలసంధిలో అమెరికా చేపట్టే ఎలాంటి చర్యనైనా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందే భావిస్తామని ఇరాన్ ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
“ఏ విదేశీ సాయుధ దళం – ముఖ్యంగా దూకుడు స్వభావం గల అమెరికా సైన్యం – హర్మూజ్ జలసంధిని సమీపించడానికి లేదా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, వాటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాం” అని ఇరాన్ సైన్యం సెంట్రల్ కమాండ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి ఒక ప్రకటనలో హెచ్చరించారు.

More Stories
45 ఏళ్లుగా పడిపోతున్న జపాన్ బాలల జనాభా
యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి
ఓ దుండగుడు వైట్‌హౌస్ భద్రతా సిబ్బందిపై కాల్పులు