అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా బెంగాల్

అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా పశ్చిమబెంగాల్ మారిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతోందని, ఈ బాధ్యత నుంచి ప్రభుత్వ యంత్రాంగం తప్పించుకోలేదని స్పష్టం చేశారు. 
 
పశ్చిమబెంగాల‌్‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకులంలో అల్ ఖైదా మాడ్యూల్స్‌గా ఉన్న తొమ్మిది మంది టెర్రరిస్టులను శనివారంనాడు ఎన్ఐఏ అరెస్టు చేసిన నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ తాజా వ్యాఖ్యలు చేశారు.  
 
‘ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారుతోంది. పోలీసులు, మమత అధికారులు రాజకీయ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు పోలీసులదే బాధ్యత. తమ బాధ్యత నుంచి వారు ఎంతమాత్రం తప్పించుకోలేరు’ అని ధన్కర్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
వాస్తవాల నుంచి ఎంత కాలం డీజీపీ, పశ్చిమబెంగాల్ పోలీసులు దూరంగా జరుగుతున్నారని ప్రశ్నించారు. సహజంగా పోలీసుల పాత్ర ప్రశంసనీయమే అయినప్పటికీ, భిన్నమైన పరిస్థితుల్లో వారు పని చేస్తున్నారని ధన్కర్ తెలిపారు. 
 
గవర్నర్ గతంలోనూ పలు అంశాల్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదిస్తూ వచ్చారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు అనుగునంగా పనిచేయడం లేదని, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి టార్గెట్‌గా మారారని ఆరోపించారు.