కరోనా లాంటి విపత్తుల నివారణ కోసం పనిచేసే డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రవేశపెట్టిన ‘ఎపిడెమిక్ డిసీజ్ (అమెండ్ మెంట్) బిల్–2020’కి శనివారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపారు.
ఈ బిల్లు ప్రకారం హెల్త్ వర్కర్లపై దాడి చేసినవారికి మూడు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా వేస్తారు. హెల్త్ వర్కర్లను తీవ్రంగా గాయపర్చిన వ్యక్తులకు ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష నుంచి 5 లక్షల దాకా జరిమానా వేస్తారు.
‘ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897’ను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 22న ‘ఎపిడెమిక్ డిసీజెస్ (అమెండ్ మెంట్) ఆర్డినెన్స్ 2020’ని జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టం తీసుకువచ్చేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ఏప్రిల్ లో ఆర్డినెన్స్ జారీ చేసినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా హెల్త్ వర్కర్లపై దాడులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్ లు అధిక బిల్లులు వసూలు చేయడంపై తాము ఇదివరకే గైడ్ లైన్స్ జారీ చేశామని చెప్పారు. టెస్టులు, ట్రీట్ మెంట్ల ధరలను కూడా రేషనలైజ్ చేశాని చెప్పారు.
బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్ సీపీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ డాక్టర్లు, నర్సులతో పాటు ఇతర హెల్త్ వర్కర్లందరినీ బిల్లులో చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల నుంచి డాక్టర్లు, హెల్త్ వర్కర్లను రక్షించాలని టీడీపీ సభ్యుడు కె. రవీంద్ర కుమార్ సూచించారు. పోలీసులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బందిని కూడా బిల్లులో చేర్చాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ కోరారు.
ఈ బిల్లు రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకునేలా ఉందని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. కరోనా సాకుతో హాస్పిటళ్ల దోపిడీని నివారించాలని, పీపీఈ కిట్లు, మాస్కులు, థర్మల్ స్కానర్లు, వెంటిలేటర్లు, ఆక్సీమీటర్లు, శానిటైజర్లను ఎక్కువ రేట్లకు అమ్మేవారిపైనా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కోరారు.
కరోనా వంటి వ్యాధుల నివారణలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో పాటు ఇతర ఎంపవర్డ్ సిబ్బంది లేదా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ఇతర సిబ్బంది కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు.
హాస్పిటళ్లు, మొబైల్ మెడికల్ యూనిట్లు, క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లతో పాటు హెల్త్ వర్కర్లు నివసిస్తున్న ఇండ్లను ధ్వంసం చేసినవారికీ ఈ చట్టం కింద శిక్ష పడుతుంది. ఈ బిల్లు ప్రకారం, డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడి చేయడాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు.
డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడి ఘటనలను ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. దర్యాప్తు 30 రోజుల్లోపు, విచారణ ఏడాదిలోపు ముగించాలి. తగిన కారణాలు ఉంటే వీటిని కోర్టు పొడిగించవచ్చు.
More Stories
ఈషా ఫౌండేషన్పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
హెచ్సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!