ఆసిఫాబాద్ అడవుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ అడవుల్లో శనివారం రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు జిల్లా స్థాయి మావోయిస్టు నేతలు మృతిచెందినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు భారీగా కూంబింగ్​ చేపట్టారు. 
 
ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ వైవీఎస్ సూధేంద్ర టీమ్​కు సాయుధ మావోయిస్టులు ఎదురుపడ్డారని తెలిసింది. తొలుత మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. 
 
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు ఏకే 47లు దొరికాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఇన్​చార్జి ఎస్పీ సత్యనారాయణ హుటాహుటిన కాగజ్ నగర్ కు చేరుకున్నారు. 
 
అయితే కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌, భార్య కాంతి లింగవ్వలు  తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దానికితోడు ఘటనా స్థలంలో ఏకే 47లు దొరకడంతో చనిపోయినవారు అగ్రనేతలు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
భాస్కర్‌ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు