చైనాకు రక్షణ రహస్యాలు అందించిన జర్నలిస్ట్ అరెస్ట్ 

దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని చైనాకు లీక్ చేసిన ఫ్రీలెన్స్ జర్నలిస్టు రాజీవ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ జర్నలిస్ట్ భారతదేశపు అత్యంత రహస్యమైన సరిహద్దుల భద్రతా వ్యూహాలను, ప్రత్యేకించి బలగాల తరలిపుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాడు.

దీనిని చైనా ఇంటలిజెన్స్ వర్గాలకు చేరవేస్తున్నాడని, దీనిని పసికట్టి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం డిసిపి సంజీవ్ కుమార్ యాదవ్ ప్రకటించారు. రాజీవ్ శర్మ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉంటూ ఈ ముసుగులో దేశ భద్రతా వ్యవహారాలను రాబట్టుకుంటూ వస్తున్నారు. రక్షణ వ్యవహారాలపై ఆయన కొన్ని భారతీయ మీడియా సంస్థలకు, చైనాకు చెందని గ్లోబల్ టైమ్స్ పత్రికకు ఆర్టికల్స్‌గా రాసి పంపుతున్నారు.

ఈ క్రమంలో ఆయన చైనా ఇంటలిజెన్స్ ఏజెంట్లతో 2016లో పరిచయాలు పెంచుకున్నాడు. తరువాత దేశ భద్రతా వ్యవహారాలను చైనా ఇంటలిజెన్స్ వారికి చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామని డిసిపి తెలిపారు. ఈ క్రమంలో ఈ జర్నలిస్టుకు ఇప్పటివరకూ ఏడాదిన్నరలో రూ 40 లక్షల వరకూ ముట్టింది. ఒక్కో సమాచారానికి ఆయన వేయి డాలర్ల చొప్పున పొందుతున్నాడు. 

ఈ ఫ్రీ జర్నలిస్టు తన వృత్తిని ఆసరాగా చేసుకుని కీలక సమాచారం రాబట్టుకోవడం తరువాత దీనిని పొరుగుదేశానికి తెగనమ్మడం గురించి మన నిఘా వర్గాలు పసికట్టాయి. పోలీసులు సరైన రీతిలో వలేసి ఈ జర్నలిస్టును ఈ నెల 14వ తేదీన అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టు గురించి అధికారికంగా ప్రకటించారు. రాజీవ్ శర్మ నుంచి అత్యంత కీలకమైన రక్షణ శాఖ పత్రాలను కూడా  స్వాధీనపర్చుకున్నట్లు డిసిపి వెల్లడించారు.

చైనాతో ప్రస్తుత సరిహద్దుల వివాదం నేపథ్యంలో ఈ జర్నలిస్టు చర్య తీవ్రస్థాయి ప్రకంపనలకు దారితీసింది. శర్మకు భారీ మొత్తంలో సొమ్మును నకిలీ కంపెనీల ద్వారా ముట్టచెప్పిన చైనా మహిళను, ఆమె నేపాలీ సహచర వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. 

ఎవరికి అనుమానాలు రాకుండా ఉండేందుకు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి నుంచి ఈ జర్నలిస్టుకు రహస్య సమాచారానికి బదులుగా అందిస్తూ వస్తున్నట్లు పోలీసుల దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. అరెస్టు అయిన వారి నుంచి కీలక సమాచారాలు ఉన్న సెల్‌ఫోన్లు,ల్యాప్‌ట్యాప్‌లు, కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనపర్చుకున్నట్లు వెల్లడైంది.