సరిహద్దుల్లో బోఫోర్స్‌ హోవిట్జర్లు మోహరింపు  

సరిహద్దుల్లో గర్జించేందుకు బోఫోర్స్‌ హోవిట్జర్లను మోహరిస్తున్నారు. . చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో లద్దాఖ్‌లో వీటిని మోహరించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హోవిట్జర్లకు మరమ్మతులు చేస్తున్నారు. పనులు పూర్తయిన వెంటనే వీటిని రంగంలోకి దింపనున్నారు.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సర్వ సన్నద్ధమవుతోంది. చైనాకు ధీటుగా అత్యాధునిక ఆయుధాలతో పాటు బలగాలను తూర్పు లద్దాఖ్‌కు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని సైన్యం బయటకు తీస్తోంది.

బోఫోర్స్‌ హోవిట్జర్‌ 1980 దశకంలో భారత సైన్యంలోకి చేరాయి. చిన్న, మధ్యస్థాయిలో కాల్పులు జరిపే సామర్థ్యం వీటి సొంతం. ప్రస్తుతం అధికారులు ఈ యుద్ధ యంత్రాలకు అధికారులు నిపుణల పర్యవేక్షణలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. పూర్తయిన వెంటనే వీటిని తూర్పు లద్దాఖ్‌లో మోహరించనున్నారు. 

భారత సైన్యంలో బోఫోర్స్‌కు ఘన చరిత్ర ఉంది. 1999 కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించడంలో కీలకపాత్ర పోషించింది. శత్రువుకు చెందిన బంకర్లు, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నిర్మించుకున్న శిబిరాలను తునాతునకలు చేసింది.

దీంతో పాకిస్థాన్‌ సైన్యానికి తీరని నష్టాన్ని కలిగింది. ప్రస్తుతం చైనాతో నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల నేపథ్యంలో మరోసారి వాటిని మోహరించాలని నిర్ణయించి, వాటిని సిద్ధం చేస్తోంది.  

ఇలా ఉండగా, ల‌డాఖ్‌లో సుమారు ప‌ది చోట్ల చైనా ద‌ళాలు భార‌తీయ బ‌ల‌గాల గ‌స్తీని అడ్డుకున్న‌ట్లు సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.  తూర్పు ల‌డాఖ్‌లోని దీప్‌సాంగ్ శ్రేణుల నుంచి పాన్‌గాంగ్ సో స‌రస్సు వ‌రకు ఈ పెట్రోలింగ్ పాయింట్లు ఉన్న‌ట్లు చెప్పారు. 

భార‌త ద‌ళాల పెట్రోలింగ్‌ను అడ్డుకోవ‌డం వ‌ల్లే.. జూన్ 15వ తేదీన ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. ఆ దాడిలో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. వాస్త‌వాధీన రేఖ వెంట పెట్రోలింగ్ పాయింట్లను ఎండ్ పాయింట్లుగా భావిస్తారు. బేస్ క్యాంపుల నుంచి సాధార‌ణంగా సైనికులు ఎండ్ పాయింట్ల వ‌ర‌కు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తుంటారు.