అన్యమతస్థులకు నేరుగా శ్రీవారి దర్శనం 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరగడమే కాకుండా, హిందూ దేవాలయాలలో సుదీర్ఘకాలంగా వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. హిందూ దేవాలయాలలో అన్యమతస్థులు  ఉద్యోగులుగా కొనసాగడమే కాకుండా, వారికి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారు. 

తాజాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అన్యమతస్థులు దర్శనం కోసం రావాలి అంటే హిందూమతం పట్ల తమకు విశ్వాసం ఉన్నాడనే డిక్లరేషన్ పై సంతకం చేయవలసిన నిబంధనకు తిలోదకాలిస్తున్నారు. ఈ నిబంధన కారణంగా ప్రస్తుత ప్రభుత్వంలో కీలక స్థానాలలో ఉన్న క్రైస్తవులకు తిరుమల రావడానికి ఇబ్బందులు లేకుండా మార్గం సుగమం చేస్తున్నారు. 

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలు. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చు. డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి సమీప బంధువు, టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. 

పైగా, గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్‌ ఇచ్చిన సందర్భాలు లేవని అంటూ ప్రస్తుతం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నారని అంటూ అక్రమాలకు రాజబాట వేసే ప్రయత్నం చేశారు. వాళ్లందరినీ గుర్తించి మనం డిక్లరేషన్‌ అడుగుతున్నామ?  అంటూ ప్రశ్నించారు. 

అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ చైర్మన్ చెప్పడం భావ్యం కాదని అంటూ బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తుల కోసం‌ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంప్రదాయాలను మార్చవద్దని హితవు చెప్పారు.

ఇలా ఉండగా, ఏపీలో జగన్ పాలనలో అన్యమత ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని విమర్శలను సహితం సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. టీటీడీతో పాటు రాష్ట్రంలో ఎక్కడా అన్యమత ప్రచారాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

కాగా, కొవిడ్‌ ఇబ్బందులతో బ్యాంకులు వడ్డీని తగ్గించడంతో గతంలో డిపాజిట్లపై 9శాతం వరకు వచ్చే వడ్డీ ప్రస్తుతం 4.5 శాతానికి తగ్గిందని సుబ్బారెడ్డి తెలిపారు. అధిక వడ్డీ లభించేలా నిబంధనలకు లోబడి ఆర్‌బీఐ గ్యారంటీ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే  శ్రీవారి సొమ్ములను  సెక్యూరిటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర బాడ్ల రూపంలో పెట్టడం మంచిపద్దతి కాదని బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి వారించారు. వడ్డీ ఎక్కువ వస్తుందనే సాకు చూపి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్న ప్రతిపాదనను టిటిడి వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.