వ్యవసాయ రంగంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులకు నిరసనగా పదవి నుండి తప్పుకున్నట్లు ప్రకటించిన మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాళీదల్ నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తాను ఆ బిల్లులను రైతు వ్యతిరేకం అని చెప్పలేదని 24 గంటల లోపలే చెప్పడం ఆసక్తి కలిగిస్తున్నది.
‘అవి రైతు వ్యతిరేక బిల్లులని నేను చెప్పలేదు. రైతులే ఆ బిల్లులను రైతు వ్యతిరేక బిల్లులు అంటున్నారు. రైతుల బాగు కోసమే ఆ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. తమ మేలు కోసమే ఈ బిల్లులను తీసుకొచ్చారని రైతులు నమ్మాలి’ అని ఓ ఇంటర్వ్యూలో సిమ్రత్ స్పష్టం చేయడం గమనార్హం.
అంటే ఆమె ఈ మూడు బిల్లుల కారణంగా రాజీనామా చేయలేదని, రాజకీయ అనివార్య పరిస్థితులే ఆమె రాజీనామాకు దారితీసిన్నట్లు స్పష్టం అవుతున్నది. మంత్రిగా గత ఆరేళ్లుగా ఎటువంటి వివాదంలో చిక్కుకోకుండా, ప్రచార ఆర్భాటాలకు పోకుండా హుందాగా ఆమె పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. అన్ని రాష్ట్రాలలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు.
వ్యక్తిగతంగా ఆమె రాజీనామా చేయవలసిన అవసరాలు లేవు. పైగా రాజీనామాకు కొన్ని గంటల ముందే ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇచ్చిన ట్వీట్ లో “భారత్ ను ఆత్మా నిర్భర్ గా చేయడం కోసం మీరు విరామం లేకుండా చేస్తున్న కృషి మా అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది” అంటూ కొనియాడారు కూడా.
ఇప్పుడు ఆమె పార్టీ వ్యతిరేకిస్తున్న మూడు బిల్లులతో ఒకటి రైతులు బహిరంగ మార్కెట్ లో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అనుమతిస్తుంది. అంటే రైతుల `ఆత్మా గౌరవం’కు భరోసా ఇస్తుంది. ఈ బిల్లును వ్యతిరేకించ వలసిన కారణం ఏమిటి?
అయితే మహారాష్ట్రలో శివసేన, పంజాబ్ లో అకాలీదళ్ కుటుంభ పార్టీలుగా మారిపోయాయి. దానితో వారి మద్దతుదారులలోనే తీవ్రమైన అసంతృప్తి, అసమ్మతి వ్యక్తం అవుతున్నది. `కుటుంభం వారసత్వ’ రాజకీయాలపై పోరాటం చేస్తున్న ప్రధాని మోదీ విధానాలు సహజంగానే ఈ రెండు పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు.
అందుకనే 90వ దశకం నుండి బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న ఈ పార్టీలో ఇప్పుడు ఇమడలేక పోతున్నాయి. మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇక పంజాబ్ లో ప్రజల మద్దతు తీవ్రంగా అకాలీదళ్ కోల్పోతున్నది. ఆ పార్టీ పొత్తును వదులు కొంటె గాని రాష్ట్రంలో రాజకీయంగా ఎదగలేమని స్థానిక బిజెపి నేతల నుండి బిజెపి అధిష్ఠానం వత్తిడులు ఎదుర్కొంటున్నది.
ఈ సందర్భంగా అకాలీదళ్ రాజకీయాల పట్ల విసుగు చెందిన పలువురు ఇప్పుడు బిజెపికి సన్నిహితంగా వస్తున్నారు. సహజంగానే ఈ పరిణామం అకాళీ నేతలకు మింగుడు పడటం లేదు.
అసమ్మతితో ఆ పార్టీని వీడిన ఎస్ ఎస్ దీండ్సా కొంతకాలంగా బిజెపి నేతలకు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. కొందరు బిజెపి నేతలు సహితం ఆయనను కలిశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది `పద్మభూషణ్’ పురస్కారం అందించింది.
అకాళీ దళ్ (టాక్సాలి) పార్టీ ఏర్పాటు చేసిన మరో అసమ్మతి నేత ఆర్ ఎస్ బ్రహ్మపుత్ర సహితం బిజెపి వైపు చూస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా ప్రధాని మోదీ అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ పట్ల గౌరవభావమే చూపుతున్నారు. గత ఏడాది వారణాసి నుండి నామినేషన్ వేసే సమయంలో ఆయనకు పాదాభివందనం చేశారు.
సమస్య అంతా ఆయన కుమారుడు, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ భర్త సుఖ్ బీర్ సింగ్ బాదల్ తోనే వస్తున్నది. పంజాబ్ లో ఇప్పుడు ఆ పార్టీ ప్రాబల్యం కోల్పోవడానికి ఆయనే ప్రధాన కారకుడిగా కనిపిస్తున్నది. దానితో బీజేపీ- అకాలీదళ్ సంబంధాల మధ్య నీలినీడలు పేరుకొంటున్నాయి.
117 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీ లో ఆ పార్టీ బలం 17కు పడిపోయింది. ఆప్ 20 సీట్లతో రెండో స్థానం పొందింది. గత ఏడాది లోక్ సభ ఎన్నికలలో ఆమె, ఆమె భర్త మాత్రమే పంజాబ్ లో ఆ పార్టీ నుండి గెలుపొందారు. అకాలీదళ్ మద్దతు దారులు ప్రధానంగా రైతులు కావడంతో పంజాబ్ లో కోల్పోతున్న పట్టును కాపాడుకోవడం కోసం వ్యూహాత్మకంగా ఆమెతో రాజీనామా చేయించినట్లు కనిపిస్తున్నది.
అయితే పంజాబ్ లో పట్టు సంపాదించుకోవడానికి ఇప్పటి వరకు అకాలీదళ్ నే అంటిపెట్టుకొని ఉంటూ వచ్చిన బిజెపికి సహితం ఇప్పుడు ఇతర అవకాశాలు రాజకీయంగా అక్కరకు వచ్చే పరిష్టితులు నెలకొంటున్నాయి.
పైగా, మరో 18 నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై పంజాబ్ బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికలలో చేరి సగం సీట్లకు పోటీ చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకుగాను బీజేపీ 23, ఎస్‌ఏడీ 94 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ పరిణామం సహితం అకాలీదళ్ కు తలనొప్పిగా పరిణమించింది.
More Stories
ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి
ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం
19 భారతీయ సంస్థలు, ఇద్దరు భారతీయులపై అమెరికా ఆంక్షలు