మరోవైపు దేశంలో ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ సత్వరమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. నిర్దేశిత గడువులోగా ఆయా కేసులన్నీ కొలిక్కిరావాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలన్న పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
తాజాగా ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుబంధ నివేదికను సమర్పించారు. ఇందులో తెలంగాణకు సంబంధించి మొత్తం 118 కేసులు తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
ఒక్క హైదరాబాద్‌లోనే ప్రజాప్రతినిధులపై 13 సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో వెల్లడించారు.
అందులో ఒక ఎమ్మెల్యేకు సంబంధించి జీవితఖైదు విధించే స్థాయి కేసు విచారణలో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయగా హైదరాబాద్‌లో మాత్రం సీబీఐ, ఈడీ కోర్టులలో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణకు ఎలాంటి సూచనలు చేస్తారని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కోరగా సత్వర విచారణ కోసం జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులే ఉంటాయి కాబట్టీ అలాంటి వాటికి సంబంధించి రాష్ట్ర హైకోర్టులకు కొన్ని ఆదేశాలు ఇస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ నమోదు చేసిన కొన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ, విచారణ ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు. వాటి విచారణ చేపట్టేందుకు ట్రయల్ కోర్టులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.
అమికస్ క్యూరీ, సోలిసిటర్ జనరల్ చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేందుకు హైకోర్టు, ట్రయల్ కోర్టులకు రేపటిలోగా కొన్ని ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రజాప్రతినిధులు దోషిగా తేలితే వారు జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదం విధించాలని పిటిషినర్, బిజెపి నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ కోరగా ఈ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు