చైనా సరిహద్దులో ఆరు నెలలుగా చొరబాట్లు లేవు

చైనా సరిహద్దులో ఆరు నెలలుగా చొరబాట్లు లేవు
భారత్, చైనా సరిహద్దులో గత ఆరు నెలలుగా ఎలాంటి చొరబాట్లు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
 
 “భారత్, చైనా సరిహద్దులో చొరబాట్లను నియంత్రించేందుకు ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట బహుళ-అంచెల విస్తరణ, మెరుగైన నిఘా, సమన్వయం, సరిహద్దులో ఫెన్సింగ్, సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడం వంటి అనుకూలమైన చర్యలు ఇందులో ఉన్నాయి” అని రాయ్ చెప్పారు. 
 
మరోవైపు పాకిస్థాన్ సరిహద్దులో చొరబాట్లపైనా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబవ్రరి నుంచి జూన్ వరకు 47 చొరబాటు ఘటనలు జరిగాయని తెలిపారు. పాక్ సరిహద్దులో ఏప్రిల్ నెలలో గరిష్ఠ సంఖ్యలో ఉగ్రవాదుల చొరబాట్లు జరిగినట్లు రాజ్యసభకు సమాధానమిచ్చారు.