కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత

కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.

1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్‌.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్‌గా సేవలు అందించారు. దుర్గాప్రసాద్ మృతిపట్ల ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  దుర్గాప్రసాద్‌ కుమారుడితో ఫోన్‌ మాట్లాడిన సీఎం జగన్‌ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇలా ఉండగా,  ఏపీలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటివరకు ఏపీలో 5,92,760కు కరోనా కేసులు చేరాయి. 

ప్రస్తుతం ఏపీలో 90,279 యాక్టివ్ కేసులునట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 4,97,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 64 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కరోనాతో రాష్ట్రంలో 5,105 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 48.06 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.