జమ్మూ కశ్మీరులో నిర్బంధంలో 223 మంది

జమ్మూ కశ్మీరులో ప్రస్తుతం 223 మంది నిర్బంధంలో ఉన్నారని, గృహ నిర్బంధంలో ఎవరూ లేరని కేంద్రం తెలిపింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఈ అంశం తెలిపారు. 

గత ఏడాది ఆగస్టులో జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం చేపట్టిన వివిధ చర్యలలో భాగంగా కొందరిని ముందస్తు అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని చెప్పారు.

2020 సెప్టెంబర్ 11 నాటికి ఆ రాష్ట్రంలో 223 మంది నిర్బంధంలో ఉన్నారని, గృహ నిర్బంధంలో ఏ ఒక్కరూ లేరని ఆయన తెలిపారు. గత ఏడాది ఆగష్టు 5న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించిన అనంతరం అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన చెప్పారు. 

2018 జూన్ 29 నుంచి 2019 ఆగస్టు 4 మధ్య(402 రోజులు) జమ్మూ కశ్మీరులో 455 ఉగ్రవాద సంఘటనలు జరుగగా 2019 ఆగస్టు 5 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 9 మధ్య(402 రోజులు) కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 211 ఉగ్ర సంఘటనలు సంభవించాయని కిషన్ రెడ్డి తెలిపారు.