చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లడఖ్ లో నెలకొన్న పరిష్టితిపై నేడు లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ 1950 నుంచి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్నదని, కానీ ఆ సమస్యలను పరిష్కరించలేకపోయాయని విచారం వ్యక్తం చేశారు.
ఇదో సంక్లిష్టమైన సమస్య అని పేర్కొంటూ శాంతియుతంగానే ఈ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సామరస్యం ముఖ్యమని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మధ్య సంబంధాల్లో అభివృద్ధి జరిగినట్లు మంత్రి తెలిపారు.
దేశ ప్రజలంతా సైనికుల వెంటే ఉంటారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలే తాను లడాఖ్ వెళ్లినట్లు చెప్పిన రక్షణ మంత్రి సైనికుల సాహసం, శౌర్యాన్ని ప్రత్యక్షంగా చూసానని, కల్నల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవలో ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను సరిగా మార్కింగ్ చేయలేదని చైనా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎల్ఏసీ వద్ద ఉన్న పరిస్థితి వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఎల్ఏసీపై భారత్, చైనాల మధ్య భిన్నభిప్రాయాలు ఉన్నాయని, ఏప్రిల్ నుంచి వాస్తవాధీన రేఖ వెంట చైనా తమ బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దౌత్య, సైనిక పద్దతుల్లో చైనాకు భారత్ హెచ్చరిక చేసిన్నట్లు రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. సరిహద్దు వెంట ఉన్న సున్నితత్వాన్ని సభ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సైనిక దళాల త్యాగాలను ప్రశంసించాలని కోరుతూ గత కొన్నేళ్ల నుంచి సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. చైనా దళాలు హింసాత్మక ధోరణితో ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
ఘర్షణాత్మక ప్రాంతాల్లో భారత్ కూడా తమ బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. సరిహద్దును రక్షించుకునేందుకు సైనిక దళాలు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. సైనిక దళాల పట్ల గర్వంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత దశలో చాలా సున్నితమైన అంశాలను వెల్లడించలేమని రాజ్‌నాథ్ తెలిపారు.
More Stories
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం