క‌రోనాపై పోరు ఇంకా ముగియ‌లేదు

 క‌రోనాపై పోరాటం ఇంకా పూర్తికాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ద‌న్‌ స్పష్టం చేశారు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న‌ద‌ని ఆయ‌న‌ తెలిపారు.   

క‌రోనా‌ మహమ్మారిపై మంగళవారం ఆయ‌న‌ రాజ్యసభలో మాట్లాడారు. దేశంలో న‌మోద‌వుతున్న మొత్తం కేసుల‌లో మృతుల రేటు 1.67 శాతంగా, కోలుకుంటున్న వారి రేటు 77.65 శాతంగా ఉందని హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ చెప్పారు.

కేసుల సంఖ్యను ప్రతి మిలియన్‌కు 3,320కి, మరణాలను ప్రతి మిలియన్‌కు 55కు పరిమితం చేయగలిగామని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు. ప్రపంచ దేశాల‌తో పోల్చుకుంటే కేసులు, మరణాల రేటు భార‌త్‌లోనే క‌నిష్టంగా ఉన్న‌ద‌ని ఆయ‌న‌ చెప్పారు. 

కాగా, సోమ‌వారం కొత్త‌గా 83,809 కరోనా కేసులు న‌మోదు కావ‌డంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. కొత్త‌గా న‌మోదైన 1,054 మరణాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 80,776కు చేరింది.

తమిళనాడులో సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రముఖ నటుడు ఫ్లోరెంట్‌ సి పెరారీ (67) మరణించారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్‌లో కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు