కుత్రిమ మేధ వంటి సాంకేతికత తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనేక రంగాలను ప్రభావితం చేయగలదని పేర్కొంటూ ఏఐ వినియోగాన్ని పౌరాణిక రాక్షసుడైన ‘భస్మాసురుడి’తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో ప్రసంగిస్తూ డీప్ ఫేక్‌లు, సైబర్ యుద్ధం, స్వయంప్రతిపత్తి గల ఆయుధ వ్యవస్థలు రక్షణ రంగంలో కొత్త సవాళ్లను విసిరాయి తెలిపారు.
“ప్రతి సాంకేతికతకు రెండు కోణాలు ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏఐ విషయానికి వస్తే, ఈ ద్వంద్వ వినియోగ సందిగ్ధత మరింత తీవ్రమవుతుంది. ఈ శక్తివంతమైన ఏఐ మోడల్ సాఫ్ట్‌వేర్‌లోని బలహీనతలను వెతికి వాటిని ఉపయోగించుకోగలదు. ఈ నమూనా బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆసుపత్రులు, విద్యుత్ గ్రిడ్‌ను బలోపేతం చేయగలదు” అని తెలిపారు.
“అయితే, ఏఐ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వీటన్నింటినీ నాశనం చేయగలదు. నేను దీనిని మన పౌరాణిక కథల్లోని భస్మాసురుడితో పోలుస్తాను. శివుడు అతడికి ఒక వరం ఇచ్చాడు. కానీ అదే వరం అతడికి శాపంగా మారింది” అని గుర్తు చేశారు. భారత సాయుధ దళాలతో ఏఐని అనుసంధానించడంపై ప్రస్తావిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల కచ్చితత్వాన్ని పెంచడంలో వినియోగించినట్లు గుర్తు చేశారు. రక్షణ రంగంలో ఏఐ వినియోగానికి ఉదాహరణగా సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను ఉదహరించారు.
“మీరందరూ సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ గురించి విని ఉంటారు. ఇది ఒక భారీ, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్తమ వినియోగానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా సైన్స్‌లను ఉపయోగించి కొత్తగా వస్తున్న ఏఐ ఆధారిత సవాళ్లకు ప్రతిస్పందనగా మన సాయుధ దళాలు తమ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా అభివృద్ధి చేశాయి” అని చెప్పారు.
ఇది భవిష్యత్తులో వారిని మరింత పోటీతత్వంగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తోందని చెబుతూ ఇలా కొత్తగా వస్తున్న సాంకేతికతలతో మన దేశం మరింత సురక్షితంగా మారడమే కాకుండా, సాధికారతను సంపాదిస్తుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారులకు పింఛను ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం ఏఐ ఆధారిత చెక్ బోర్డును అభివృద్ధి చేసిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
More Stories
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్
టూరిస్ట్ వీసాపై వచ్చిన ముగ్గురు మతబోధకులపై వేటు!
బెంగాల్ లో బీజేపీకి మెజారిటీ, టీఎంసీ పతనం .. పలు ఎగ్జిట్ పోల్స్