కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేడాకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ విమర్శలు హద్దులు దాటాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసు రాజకీయ వైరం కారణంగా ప్రేరేపించబడినట్లు కనిపిస్తోందని, కస్టడీ విచారణ అవసరం లేదని జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థిపై దెబ్బకొట్టేట్లుగా అరెస్ట్ చేసే అధికారాన్ని అంత త్వరగా వినియోగించవద్దని అస్సాం రాష్ట్రాన్ని హెచ్చరించింది. వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించరాదని 22 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది.
వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అత్యంత విలువైన ప్రాథమిక హక్కును కేవలం రాజకీయ వైరం కారణంతో బంధించకూడదని, ఉన్నతమైన ప్రమాణాల వద్ద సమర్థించాలని పేర్కొంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మకి మూడు పాస్ పోర్ట్ లు ఉన్నాయని, విదేశాల్లో కంపెనీలు ఉన్నాయని పవన్ ఖేరా ఏప్రిల్ 5న జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ఆమె గువాహటిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఖేరా తొలుత గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురు కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టుకు తీసుకెళ్లారు.

More Stories
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు
టీఎంసీ రెబల్ గ్రూప్‌లో 19 మంది ఎంపీలు స్పీకర్‌కు లేఖ!
అత్యధిక కాలం ప్రధానిగా మోదీ.. కేంద్ర మంత్రివర్గం ప్రశంసలు