విమోచన దినం భయంతో అసెంబ్లీ సమావేశాల కుదింపు

సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరపాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆందోళన చేపట్టడంతో  ఖంగారు పడుతున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమావేశాలను రేపటితో ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలను  ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు జరుపుతామని అంటూ వచ్చిన కేసీఆర్, బీసీఏ సమావేశంలో ఈ ఈనెల 18 వరకు జరపాలని నిర్ణయించారు. అయితే అంతకన్నా 12 రోజుల ముందుగానే బుధవారంతో సమావేశాలకు ముగింపు పలికే ఆలోచనలు ఉన్నారు. 
 
గురువారం బిజెపి విమోచన దినంను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మౌనం వహించడంపై ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నది. 
 
ఇదే అంశంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి పేరిట ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో అసెంబ్లీలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసెంబ్లీకి వచ్చే రోడ్లన్నీ మూసేసి, వందల మందిని అరెస్టు చేయాల్సి వచ్చింది. మళ్లీ సెప్టెంబర్​ 17న బీజేపీ శ్రేణులు అసెంబ్లీని ముట్టడించే వ్యూహంలో ఉన్నట్టు నిఘా వర్గాలు సర్కారుకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
 
అందుకనే సమావేశాలను హడావుడిగా ముగింపనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంకు అవసరమైన అన్ని బిల్లులకు దాదాపుగా ఆమోదం పొందారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, బందోబస్తు డ్యూటీలో ఉన్న 20 మంది పోలీస్​ కానిస్టేబుళ్లకు పాజిటివ్​ వచ్చింది. కరోనాను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలను కుదించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తున్నది.