ఉగ్రవాదం నుండి కాశ్మీర్ యువతను కట్టడి చేస్తున్న సైన్యం 

కశ్మీర్ లోయలో యువకులు ఉగ్రవాదులుగా మారకుండా ఉండేందుకు సైన్యం చర్యలు తీసుకుంటున్నది. స్థానికులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా చెడు అలవాట్లకు గురవుతున్న యువతను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబం లేదా స్నేహితులను లేదా స్థానిక ఉగ్రవాదులను తొలుగ గుర్తించే పనిలో ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. 

యువతకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ తిరిగి ఆయుధాలు పట్టుకోకుండా వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు కరువై బలహీనమైన పరిస్థితుల్లో ఉగ్రవాదం వైపు యువకులు చూడకుండా ఉండేందుకు సరైనా మార్గదర్శకత్వం చేయడం ద్వారా వారు తప్పుడు పనులు చేయకుండా నిరోధించవచ్చు అని కశ్మీర్‌లోని విక్టర్ ఫోర్స్ 15-కార్ప్స్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు అభిప్రాయపడ్డారు. 

పుల్వామా, అనంతనాగ్, షోపియన్, కుల్గాం జిల్లాల్లోని యువతను గుర్తించే పనిలో సైనిక బలగాలు నిమగ్నమయ్యాయని ఆయన తెలిపారు. ఉగ్రవాద గొలుసును విచ్ఛిన్నం చేయడంపై సైన్యం యొక్క దృష్టి ఉన్నదని చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాల గురించి సైన్యం సమీక్ష చేపట్టింది. 

ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన స్థానిక ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది యువకులు ఉగ్రవాదానికి మారకుండా నిరోధించడంలో విజయం సాధించారు. ఇలాఉండగా, ఈ ఏడాది 80 మంది స్థానిక యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు తమ వద్ద సమాచారం ఉన్నదని దక్షిణ కశ్మీర్ డీఐజీ అతుల్ గోయెల్ చెప్పారు.

ఉగ్రవాద సంస్థల్లో చేరిన యువతను ఇంటికి తిరిగి రావాలని వారి కుటుంబసభ్యులతో చెప్పిస్తున్నారు. ఇలా సైన్యంతో కలిసి పనిచేస్తున్న కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అండగా ఉండేందుకు సైనిక దళాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఉగ్రవాద సంస్థల్లో చేరిన యువకుల కుటుంబాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని సైన్యం భావిస్తున్నది. 

2016 లో లష్కర్ ఏ తైబాలో చేరిన అనంతనాగ్ కు చెందిన 20 ఏండ్ల మాజిద్ ఖాన్.. తన తల్లి చేసిన విజ్ఞప్తి మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. సైన్యం వీరి కుటుంబానికి అండగా నిలువడంతో మాజిద్ ఖాన్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వెలుపల ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ సమాజానికి ఉపయోగపడేలా తయారవుతున్నాడు.