
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సభలో ప్రవేశపెడుతూ ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.
భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారని కేసీఆర్ ప్రశంసించారు.
ప‌్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. మిత్ర పక్షాలను కలుపుకుని పోవడంలో విశ్వసనీయుడిగా ఆయన పేరొందారని చెప్పారు.
ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగా మాత్రమే విమర్శించేవారని, వ్యక్తిగతంగా విమర్శించే వారు కాదని గుర్తు చేశారు. జఠిల సమస్యను సామరస్యంగా పరిష్కరించే వారు ప్రణబ్ అని పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవి అలంకరించిన, జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో భారతరత్న అవార్డును బహుకరించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుటకు సహాయ పడిన వారిగా కాకుండా, రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
More Stories
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు
25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’