దుబ్బాక టీఆర్ఎస్‌లో తిరుగుబాటు ధోరణులు 

టీఆర్ఎస్‌ ఎమ్యెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో త్వరలో ఉపఎన్నిక జరుగనున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సొంత పార్టీలో తిరుగుబాటు ధోరణులు చెలరేగడం అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. తిరిగి రామలింగారెడ్డి కుటుంభం సభ్యులకే సీట్ ఇవ్వొచ్చని సంకేతాలు వెలువడుతూ ఉండడంతో స్థానిక పార్టీ నాయకులు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
కొద్ది రోజులుగా  దుబ్బాకలో అసమ్మతి స్వరాలు వినిపిస్తుండగా శనివారం అసమ్మతి నేతలు నేరుగా బహిరంగంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగలేదని అంటూ ఒక విధంగా పార్టీ అధినాయకత్వం పట్ల ధిక్కార ధోరణులను వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తీసుకువచ్చారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఆ కుటుంబానికి టికెట్టు ఇస్తే మళ్లీ తమను అణగదొక్కుతారని ఆందోళన  వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా ఓ మంచి నాయకునికి టికెట్టు ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్లారెడ్డి, పీఏసీఎస్ మాజీ  చైర్మన్ రవీంద్రరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ ఛైర్మన్ రాజయ్యతోపాటు పార్టీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరోవంక,  తొగుట మండలంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అసమ్మతి నేతల మధ్య సయోధ్య కుదర్చడం కోసం  ఆందోల్ ఎమ్మెల్యే  క్రాంతికిరణ్  కొండపాకలోని మెదక్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్ర్యతేక  సమావేశం ఏర్పాటు చేశారు.
మండల పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే అనవసరమైన సమస్యలు ఏర్పడతాయని పక్క మండలంలో నిర్వహించినా చివరకు రసాభాసగా మారింది. జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ భర్త నరేందర్రెడ్డి మధ్య సమావేశం సందర్భంగా వాగ్వివాదం జరిగింది. వారిద్దరిని శాంతిపజేయాలని నాయకులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో అందరిని అక్కడి నుంచి పంపించి వేశారు.

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 2న చెరుకు ముత్యంరెడ్డి  ప్రథమ వర్థంతి సందర్భంగా నియోజకవర్గంలోని మండలాల్లో బల ప్రదర్శన సైతం నిర్వహించారు.