కొవిడ్‌ లేకుంటే ఈ పాటికి కేసీఆర్ దుకాణం బంద్ 

కొవిడ్‌-19.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భిక్ష పెట్టిందని, లేదంటే ఈ పాటికే ఆయన దుకాణం మూసుకునేవారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్‌కుమార్‌  ఎద్దేవా చేశారు. సీఎం వైఖరి పట్ల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సైతం సంతృప్తిగా లేరని, మోదీ లేకుంటే తమ బతుకేంది? అంటూ చాటింగ్‌ చేసుకుంటున్నారని చెప్పారు.   

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నాయకుడు మాదాసు వెంకటేశ్‌తోపాటు జనగామ, భువనగిరి జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మజ్లిస్‌ పార్టీకి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పగించారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వాటిని క్రమబద్ధీకరించుకోవడానికే ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. 

ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు అధిక సంఖ్యలో బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు హామీలు గుప్పించిన కేసీఆర్‌.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని దుయ్యబట్టారు.   

అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమరవీరుల త్యాగాలను విస్మరిస్తూ, నిజాం వారసత్వానికి కేసీఆర్‌ కొమ్ముగాస్తున్నారని మండిపడ్డారు.  

 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో 7న తహసీల్దార్లు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, 8న రజాకార్ల దాడులకు గురైన ప్రాంతాలను, 9న కొలనుపాక, బైరాన్‌పల్లి, అమరధామం, జోడిగడ్‌ ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయించారు. 

10న హైదరాబాద్‌లో మేధావుల సదస్సు, 11న నిరసన కార్యక్రమాలు, 15న కళాకారులకు సన్మానాలు, 16న తెలంగాణ సమాజం స్పందించే కార్యక్రమం చేపట్టాలని, 17న ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపిచ్చారు.  అదే రోజు సాయంత్రం వర్చువల్‌ బహిరంగసభ ఉంటుందని చెప్పారు.