ప్రతీ పేద కుటుంబం సొంతంగా ఇల్లు   

ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ప్రతీ పేద కుటుంబం సొంతంగా ఇల్లు నిర్మించుకునే విధంగా అధికారులు బ్యాంకులు, పూర్తి సహాయ సహకారాలు అందించి, కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. 
 
కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో  జరిగినహైదరాబాద్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంకు అధ్యక్షత వహిస్తూ ఉన్న చోట సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన లక్షకు పైగా ఆవాస్ యోజన దరఖాస్తులు , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిశీలించి అర్హులకు రుణాలు ఇప్పించి గృహ నిర్మాణం జరిగేలా చూడాలని చెప్పారు. 
 
 ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల స్వనిధి, ముద్ర రుణాలు, ఇంకా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల రుణ పంపిణీలపై జరిగిన సమీక్ష లో మంత్రి మాట్లాడుతూ  “ఆయా పథకాల క్రింద ఎక్కువ సంఖ్యలో రుణాలు మంజూరు చేసి తద్వారా ప్రజలకు స్వయం ఉపాధి కల్పించేలా చూసి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచాలని” అధికారులకు సూచించారు.  

హైదరాబాద్ నగరంలో వీధి వ్యాపారుల లబ్ధి కోసం, కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తో ఫోన్ లో మాట్లాడి, పీఎం స్వనిధి పథకం కోసం దరఖాస్తు చేసేందుకు గడువు విషయంలో  స్పష్టత నివ్వాలని సూచించారు.  

తెలంగాణలో రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. వీధి వ్యాపారులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడగించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన కోరారు. 

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ  రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ లక్ష్మణ్ , ప్రభుత్వ శాఖల , వివిధ బ్యాంక్ అధికారులు హాజరు అయ్యారు. 

తర్వాత పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే  ప్రారంభం కావాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సి సి ఐ అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో  సి సి ఐ, నాఫెడ్ , మార్క్ఫెడ్, రాష్ట్ర మార్కెటింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. పత్తి రైతుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.