ప్రధానిని బెదిరిస్తూ ఈమెయిల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు ఈమెయిల్‌ రావడం కలకలం రేపింది. మోదీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని ఓ జాతీయ వార్తా ఛానెల్‌ వెల్లడించింది. 

ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్‌ఐఏ వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్ట్‌ 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. 

బెదిరింపు మెయిల్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్‌ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) దృష్టికి తీసుకువెళ్లింది.

బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్‌ఐఏ రంగంలోకి దించింది.అసలు ఈమెయిల్‌ ఎక్కడినుంచి వచ్చిందో రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.