శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో ‘ఆపరేషన్ టైగర్’లో భాగంగా వీరంతా తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ కు అధికారికంగా లేఖ సమర్పించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతును కూడగట్టుకుని వీరు షిండే వర్గంలో చేరేందుకు సిద్ధం అయిపోయారు.
గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి శివసేన (యుబిటి) లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు హాజరుకాకపోవడంతో అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు ఎంపీలు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారాలని, ఉద్ధవ్ సేనను మరోసారి చీల్చే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఉద్ధవ్ సేనకు తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులున్నారు. వారిలో ముగ్గురు మాత్రమే గురువారం నాటి పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు: అనిల్ దేశాయ్, అరవింద్ సావంత్ మరియు రాజాభౌ పరాగ్ ప్రకాష్ వాజే. మిగిలిన ఆరుగురు ఎంపీలు — సంజయ్ జాదవ్, భౌసాహెబ్ వాక్‌చౌరే, ఓంరాజే నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్ , నగేష్ పాటిల్ అష్టికర్ — సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశానికి ఎగ్గొట్టిన ఎంపీలపై చర్య తీసుకునే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోందని, వారికి షోకాజ్ నోటీసు పంపిస్తామని యూబీటీ చీఫ్ విప్‌గా ఉన్న దేశాయ్ తెలిపారు. “విప్ ఉన్నప్పటికీ వారు ఎందుకు సమావేశానికి హాజరు కాలేదో వారు వివరించాలి. అదనంగా, వారు ఎందుకు సమావేశానికి హాజరుకాలేకపోయారు అనే వివరాలను వారు అందించలేదు” అని దేశాయ్ విలేకరులతో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఠాక్రే సన్నిహితుడిగా పరిగణించబడుతున్న శివసేన (యుబిటి) రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్, ఎంపిలను ‘ద్రోహులు’ అని అభివర్ణించారు. మిగతా 6 మంది ఎంపీలు స్పీకర్‌ను కలిస్తే అదే ఫొటో చూపించండి.. దీన్నే వ్యూహం అనరు, ద్రోహం అని, ఇప్పటికీ మా పార్టీ సభ్యులే, మా గుర్తుపైనే గెలిచారని, పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాగా, శివసేన ఎమ్మెల్సీ చంద్రకాంత్ రఘువంశీ మాట్లాడుతూ ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే సేనలో చేరారని, అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. “మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ జరిగింది. ఈరోజు ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేపై విశ్వాసం వ్యక్తం చేసి శివసేనలో చేరారు… వారు మాతో చేరడం విశేషం. నేను వారిని స్వాగతిస్తున్నాను” అని ఆయన తెలిపారు. మరోవంక, ఉద్ధవ్ సేన ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖను సమర్పించింది. మరియు శివసేన (యుబిటి) నిజమైన శివసేనగా కొనసాగుతూనే, మరే ఇతర విభాగాన్ని యుబిటిగా గుర్తించవద్దని కోరింది.
ఈ పరిణామంతో పార్లమెంట్‌లో షిండే శివసేన బలం ఒక్కసారిగా 7 నుంచి 13కు పెరగనుంది. ముంబైలో జరగబోయే శివసేన ఉత్సవాల్లో ఈ విలీనంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో 2022లో ఎమ్మెల్యేలను చీల్చి షిండే అధికారం చేపట్టిన తరహాలోనే ఇప్పుడు పార్లమెంట్ వేదికగా సాగిన ఈ నిశ్శబ్ద తిరుగుబాటు మహారాష్ట్రతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ అధికార సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. లోక్‌సభ స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.

More Stories
మమతా బెనర్జీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రతనే
అపోలో హాస్పిటల్స్ `ఫెమా’ ఉల్లంఘన.. రూ.17.76 కోట్ల జరిమానా
ప్రధానిగా మోదీ ఉండగా భారత్ పై దాడి జరిగితే అండగా ఉంటాం