మమతా బెనర్జీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రతనే

మమతా బెనర్జీకి  హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రతనే

* టీఎంసీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ చేయాలంటూ లేఖ

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రెబల్ నేత రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఎలాంటి మార్పునకు ఆదేశించలేమని కోర్టు తెలిపింది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ క్రిష్ణా రావ్ ఈ కేసుపై నిర్ణయం తీసుకున్నారు.
 
టీఎంసీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, తమ పార్టీ తరఫున రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని బెంగాల్ స్పీకర్ రతింద్ర బోస్‌ను కోరారు. 90 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో ఆయననే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 
అయితే, తాము సూచించిన ఎమ్మెల్యేను కాకుండా స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష నేతగా రితబ్రతను మార్చలేమని కోర్టు తెలిపింది. ఈ అంశంపై స్పందించాలని స్పీకర్‌తోపాటు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో తమ స్పందన తెలియజేయాలని కోరింది. దీనిపై స్పందించిన ప్రతివాదులు తాము అఫిడవిట్ సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. అయితే, కోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. అలాగే, తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది.  
ఇలా ఉండగా, తాజాగా పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని కోరుతూ మమతా బెనర్జీకి నమ్మకస్తుడైన మాజీ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్, హెడీఎఫ్‌సీ బ్యాంకు కోల్‌కతా బ్రాంచ్‌కు ఒక లేఖ రాశారు. టీఎంసీని చట్టబద్ధంగా ఎవరు నియంత్రిస్తున్నారనే దానిపై ‘తీవ్రమైన వివాదం’ ఉన్నదని అరూప్ బిశ్వాస్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల వల్ల తిరుగుబాటు నాయకులు సంతకం చేసిన చెక్కులు ప్రస్తుతం చలామణిలో ఉన్నా లేదా వివాదాస్పద అధికారం కలిగిన వ్యక్తుల వద్ద ఉన్నా, అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు తృణమూల్ మాజీ కోశాధికారి అయిన అరూప్ బిశ్వాస్, పార్టీ కోశాధికారిగా పేర్కొంటూ జూన్‌ 16న హెడీఎఫ్‌సీ బ్యాంకుకు ఈ లేఖ రాయడం మరో అంతర్గత వివాదానికి దారి తీసింది. అయితే అరూప్ బిస్వాస్ పార్టీ కోశాధికారిగా లేరని టీఎంసీ స్పష్టం చేసింది. పునర్‌వ్యవస్థీకరణ చర్యలో భాగంగా అన్ని పార్టీ యూనిట్లను మమతా బెనర్జీ రద్దు చేసినట్లు పేర్కొంది.