25 మంది ఎస్పీ ఎంపీలు పార్టీ నుంచి విడిపోయేందుకు సిద్ధం

25 మంది ఎస్పీ ఎంపీలు పార్టీ నుంచి విడిపోయేందుకు సిద్ధం
 
ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే తదుపరి అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో  సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుత నాయకత్వంపై పలువురు నాయకులు, ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారని  ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య  ఆరోపించారు. “సమాజ్‌వాదీ పార్టీలో పరిస్థితి సాధారణంగా లేదు. చాలా మంది నాయకులు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. సుమారు 25 నుంచి 26 మంది ఎస్పీ ఎంపీలు పార్టీ నుంచి విడిపోయే స్థితిలో ఉన్నారు. అయితే, ఫిరాయింపులను ప్రోత్సహించే ఎలాంటి రాజకీయాలకు బీజేపీ పాల్పడటం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ భవిష్యత్తు పతనం వైపు పయనిస్తోందని పేర్కొంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ నిరాశాజనకమైన ఫలితాలను చవిచూస్తుందని  ఆయన స్పష్టం చేశారు.  అఖిలేష్ యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు చేస్తూ, 2027లో సమాజ్‌వాదీ పార్టీ కఠినమైన రాజకీయ పోరాటాన్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. 
 
“పశ్చిమ బెంగాల్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఎలాగైతే బలహీనపడ్డాయో, 2027లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. అఖిలేష్ యాదవ్ సైకిల్ ఇకపై అధికార పీఠాల వరకు చేరదు, అది సైఫాయ్‌కే పరిమితమై ఉంటుంది,” అని మౌర్య తెలిపారు. ఎన్నికల కాలం సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలోని అంతర్గత విభేదాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు.
 
 అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలు, ఆలయ ట్రస్ట్‌కు అందిన విరాళాలకు సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ  ఆలయ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను మౌర్య తోసిపుచ్చారు. విరాళాల పెట్టెలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని, వాటిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.
 
“శ్రీరాముడి పేరు మీద వచ్చిన విరాళాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటే, ప్రతి రూపాయిని రాబట్టగలం. విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుంది, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా బ్రాహ్మణులను చేరుకునే కార్యక్రమాలను నిర్వహించాలన్న అఖిలేష్ యాదవ్ వ్యూహంపై వ్యాఖ్యానిస్తూ, కేవలం సమావేశాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేమని మౌర్య ఎద్దేవా చేశారు. 
 
“సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణుల సమావేశాలు, ఠాకూర్ల సమావేశాలు లేదా ఇతర వర్గాల వారి కోసం సమావేశాలు నిర్వహించవచ్చు, కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు కుల రాజకీయాలకు అతీతంగా ఎదిగారు. వారికి అభివృద్ధి, సుపరిపాలన, శాంతిభద్రతలు కావాలి,” అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ సమాజాన్ని ఏకం చేయాలని విశ్వసిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వర్గాలను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. 
 
బీజేపీ ఎన్నికల అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ   2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ వరుసగా మూడవసారి అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.  అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలపై దృష్టి సారించడం వల్లే ఆ పార్టీకి ప్రజల మద్దతు కొనసాగుతోందని మౌర్య చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తడానికి ప్రతిపక్ష పార్టీల వద్ద బలమైన అంశాలు లేకపోవడంతో, అవి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.