దేశమంతా ఒకే ఓటరు లిస్టు 

లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా తయారు చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ తయారు చేసిన జాబితా, మునిసిపల్‌, కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్‌ఈసీ)లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు. 

అనేక రాష్ట్రాలు ఈసీ జాబితాలనే స్థానిక ఎన్నికలకూ ఉపయోగిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాలు తమ సొంత జాబితాలను తయారుచేసుకుంటున్నాయి. ఇది తీవ్ర గందరగోళానికి, విమర్శలకు తావివ్వడమే కాక- విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని కేంద్రం భావిస్తోంది. 

కొందరి పేర్లు రాష్ట్రాల జాబితాలో ఉండి ఈసీల లిస్టులో లేకపోవడంతో ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్న  సందర్భాలనేకం ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గాను-  ఈనెల 13న ప్రధాని కార్యాలయ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలను చర్చించారు.

(1) దేశమంతా ఒకే ఓటరు లిస్టు ఉండేట్లుగా రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏలను సవరించడం.

(2) ఈసీ తయారు చేసే జాబితాలనే స్థానిక ఎన్నికలకూ వాడండని రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చచెప్పడం. 

ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీకే మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, లెజిస్లేటివ్‌ కార్యదర్శి జి నారాయణరాజు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సునీల్‌ కుమార్‌, ఈసీ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా సహా మరో ముగ్గురు అధికారులు, లా కమిషన్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఒకే ఓటరు జాబితా ప్రతిపాదనకు ఈసీ, లా కమిషన్‌, న్యాయ శాఖ, పంచాయతీరాజ్‌ విభాగాలు సై అన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మొదలైన అంశాలపై ఎస్‌ఈసీలకు అధికారమిచ్చేవి 243కే, 243జెడ్‌ఏ అధికరణలు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి అధికారమిచ్చేది ఆర్టికల్‌ 324(1).

ఎస్‌ఈసీలు స్థానిక ఎన్నికల వరకూ సొంతంగా జాబితాలు రూపొందించుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. కానీ, చాలా రాష్ట్రాలు ఈసీ జాబితాలనే స్థానిక ఎన్నికలకు వాడుతున్నాయి. ఇకపై ఈసీ జాబితాలనే స్వీకరించండని ఈ రాష్ట్రాలకు నచ్చచెప్పడం మంచిదని పంచాయతీరాజ్‌ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ గట్టిగా అఽభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

మిశ్రా కూడా దీన్ని ఆమోదిస్తూ రాష్ట్రాలను నెల రోజుల్లో ఒప్పించే బాధ్యతను రాజీవ్‌ గౌబాకు అప్పగించారు. రాష్ట్రాలు అంగీకరించకపోతే- రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలిస్తారు. దీని విధి విధానాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని లా కమిషన్‌, న్యాయశాఖను కోరినట్లు తెలుస్తోంది.