గాంధీ కుటుంబం లేకపోయినా కాంగ్రెస్ మనుగడ   

గాంధీ కుటుంబం లేకపోయినా కాంగ్రెస్ మనుగడ సాగించగలదని, వృద్ధిలోకి వస్తుందని ఆ పార్టీ బహిష్కృత నేత సంజయ్ ఝా చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతలను గ్రూప్ ఆఫ్ ట్వెంటీ త్రీగా ఝా అభివర్ణించారు. 

ఈ జీ–23లో ప్రముఖ నేతలు  గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వస్నిక్, కపిల్ సిబాల్ ఉన్నారని గుర్తు చేశారు. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన శశి థరూర్‌‌, యంగ్ లీడర్స్‌ మనీశ్ తివారీ, మిలింద్ డియోరా, జితిన్ ప్రసాద కూడా ఉన్నారని పేర్కొన్నారు.

‘నెహ్రూ–గాంధీ కుటుంబీకులు పార్టీ పగ్గాలు చేపట్టబోమని బహిరంగంగా చెప్పారు. దీని వల్ల గాంధీయేతర నేత కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు పెరిగాయి’ అని వివరించారు. బీజేపీలా కాకుండా కాంగ్రెస్‌లో నాయకత్వ కొరత అనేది లేదని పేర్కొంటూ నాయకత్వం తీసుకోవడానికి చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. 

పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్ లాంటి ఇద్దరు గాంధీయేతర కాంగ్రెస్ నేతలు భారత ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేశారని గుర్తు చేశారు. అలాగే పరిపాలన, విదేశాంగ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.  యంగ్ ఇండియా మెరిట్ ప్రాతిపదికన దేన్నయినా ఎంచుకునే విధానం కావాలని కోరుకుంటోందని సంజయ్ ఝా తెలిపారు. 

మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ (సీఎఫ్‌డీ), శరద్ పవార్ (ఎన్సీపీ), జగన్ మోహన్ రెడ్డి (వైఎస్‌ఆర్‌‌సీపీ) లాంటి ప్రముక నేతలు కాంగ్రెస్ నుంచే పుట్టుకొచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా ఓ నాయకుడికి స్పష్టమైన అవకాశం, నెహ్రూ‌‌–గాంధీ కుటుంబ సభ్యులతోపాటు అందరూ దన్నుగా నిలిస్తే సరిపోతుందని హితవు చెప్పారు. 

కాంగ్రెస్‌కు స్ఫూర్తి నింపే, ఉద్వేగపూరిత, అవగాహన కలిగిన కమ్యూనికేటర్, గెలుపుపై ఆకలి గల, లక్ష్యాలను సాధించాలనే కోరిక ఉన్న నాయకుడి  అవసరం నేడు ఉన్నదని స్పష్టం చేశారు. అటువంటి నాయకుడికి  ప్రజాస్వామ్య, సాంఘిక, లౌకిక భారతంపై విశ్వాసం ఉండాలని చెబుతూ తనకు తెలిసి పార్టీలో అలాంటి నేతలు చాలా మంది ఉన్నారని ఝా వివరించారు.