ప్రకృతి పరిరక్షణ బాధ్యత అందరిదీ

ప్రకృతి పరిరక్షణ బాధ్యత అందరిదీ

ప్రకృతిని పరిరక్షించాలని, ఇది మనందరి బాధ్యత అని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌‌ఎస్‌ఎస్‌) చీఫ్​ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రకృతిని వాడటమే కాకుండా దాని అభివృద్ధి, పరిరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. 

హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్, మరింత నైత్తిక, సాంస్కృతిక ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణతో కలసి జరిపిన పకృతి వందన్‌ వర్చువల్ సంబరాల్లో భగవత్ పాల్గొంటూ భారత్ అందించే సుస్థిరమైన జీవన విధానమే మానవాళి భవిష్యత్ కు మార్గమని స్పష్టం చేశారు. గత 300- 350 ఏళ్లుగా ఈ జీవన విధానానికి దూరం కావడమే పర్యావరణ సమస్యలకు కారణమని తెలిపారు.

 తాము వినియోగించుకోవడం కోసమే ప్రకృతి ఉందని ప్రజలు భావిస్తున్నారని చెబుతూ అయితే  దాని పరిరక్షణ కోసం వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ‘మనం గత 300 నుంచి 350 ఏళ్లుగా ఈ విధంగా జీవిస్తున్నాం. దాని పర్యవసాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మనుషులే కాదు ఈ ప్రపంచమూ మనుగడ సాగించలేదు’ అని హెచ్చరించారు.

ప్రకృతి పరిరక్షణకు సంబంధించి మనుషులుగా మనం తీసుకోవాల్సిన బాధ్యతలను మన పూర్వీకులు ముందే గ్రహించారని చెబుతూ  ప్రకృతి పరిరక్షణకు పాటుపడాల్సిన, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మనుషులగా మనందరిపైనా ఉందని భగవత్ పేర్కొన్నారు. 

మన శరీరంలోని వివిధ భాగాలు కలసి పనిచేసినప్పుడే మన శరీరం పనిచేసే విధానంగా మొత్తం ప్రకృతిలో మనం ఒక భాగం మాత్రమే అని మన పూర్వికులు గ్రహించారని ఆయన తెలిపారు. పకృతి గురించి చర్చించడం అంటే ఒక రోజుకు సంబంధించినది కాదని అంటూ మన జీవన విధానంలో క్రమంగా మార్పులు రావలసిన అవసరం ఉన్నదని చెప్పారు. 

నాగ పంచమి, గోవర్ధన్ పూజ లేదా తులసి పూజ వంటి హిందువులు పర్వదినాలను ప్రస్తావిస్తూ ఆధునిక తరాలు కూడా వాటి గురించి తెలుసుకొనే విధంగా అటువంటి పండగలను నేడు కూడా  ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా అనుసరించాలని ఉద్భోదించారు. 

మన జీవన విధానంలో అందరినీ గౌరవిస్తాం. కానీ ఇతర ప్రపంచం, వారి జీవన విధానాల‌తో దాన్ని మనం కోల్పోయామని తెలిపారు. కానీ ఇవ్వాళ ప్రకృతిని గమనించడం ద్వారా ఆ విలువలను నెమ్మదిగా మనం తిరిగి పొందుతున్నామని భగవత్ పేర్కొన్నారు.