మొహర్రం ఊరేగింపులకు అనుమతివ్వలేం

కరోనా ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో ఈ వారాంతంలో జరుగనున్న మొహర్రం ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఊరేగింపులకు అనుమతి ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సయ్యద్‌ కల్బి జావెద్‌ వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఇటువంటి ఊరేగింపులను తీస్తే జరిగే పరిణామాలకు ఓ మొత్తం వర్గం కరోనా వ్యాప్తికి కారణమయిందనే విమర్శలు తలెత్తుతాయని ధర్మాసనం తెలిపింది. మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు బహిరంగ ఉరేగిపులు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో ప్రతి చోటా ప్రజలు గుమికూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందేందుకు వీలుంటుందని ధర్మాసనం తెలిపింది.  

ఇటీవల పూరీ రథయాత్రకు అనుమతిని ఇచ్చారని,దీనిని తమకు కూడా వర్తింపచేయాలని పిటిషనర్ కోరారు. అయితే పూరీ రథయాత్ర ఒక నిర్థిష్ట ప్రాంతంలోనే జరుగుతుంది, అంతేకాకుండా యాత్రను ఓ ప్రత్యేక మార్గంలోనే నిర్వహిస్తారని సుప్రీంకోర్టు తమ రూలింగ్‌లో తెలిపింది. 

అక్కడి నియమాలు ర్యాలీ మార్గం వల్ల సరైన రీతిలో వైరస్ నియంత్రణకు అవకాశం ఉందని, అయితే దేశవ్యాప్తంగా మొహర్రం ర్యాలీలకు వీలు కల్పించేందుకు అనుమతిని ఇవ్వడం కుదరదని, ఆయా ప్రాంతాలు పరిస్థితులను బట్టి తేల్చుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపారు. 

మొహర్రం ఊరేగింపులు ఓకే సామాజిక వర్గానికి చెందిన వారితో సాగుతాయని, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వీటికి అనుమతిని ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా వీరి వల్లనే తిరిగి కరోనా వ్యాపించిందనే వాదనకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. 

కనీసం లక్నోలో అయినా మొహర్రం ఊరేగింపులకు అనుమతిని ఇవ్వాలని ఆ ప్రాంతానికి చెందిన పిటిషనర్ వేడుకున్నారు. దీనికి సంబంధించి సంబంధిత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లడం మంచిదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.