షెడ్యూల్ ప్రకారమే  నీట్, జెఇఇ పరీక్షలు 

నీట్, జెఇఇ (మెయిన్) పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోమారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.  

జెఇఇ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్‌టిఎ డిజి తనతో చెప్పారని పోఖ్రియాల్ వెల్లడించారు. నీట్ పరీక్షకు సంబంధించి కూడా 15.97 లక్షల అభ్యర్థులకు గానూ 10లక్షల మందికి పైగా అడ్మిట్ కార్డులను 24 గంటల్లో డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి చెప్పారు. 
 
విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోందని పోఖ్రియాల్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జెఇఇ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ పరీక్షా కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచినట్లు ఆయన వెల్లడించారు. 
 
విద్యార్థుల ఎంపిక ప్రకారమే వారికి పరీక్ష కేంద్రాన్ని కేటాయించే అవకాశం కల్పించినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.