కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌కు కరోనా

మరో కేంద్ర మంత్రికి కరోనా సోకింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని క్రిషన్ పాల్ స్వయంగా వెల్లడించారు. 

ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన కోరారు. ప్రజలు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 

దేశంలో కరోనా రోజురోజుకు అధికమవుతూనే ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, ఒక్కరోజులోనే దేశంలో 75,760 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,023 మంది కరోనాతో చనిపోయారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 60వేలు దాటింది. 

25,23,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం 7,25,991 మంది కరోనాతో బాదపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు రెండు గజాల భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు.