ఎస్సీ, ఎస్టీల్లోనూ క్రీమీలేయర్‌

ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉప వర్గీకరణకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని 2004లో తామిచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది.

నాటి తీర్పును సరైనదిగా భావించటం లేదని, ఉపవర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని అభిప్రాయపడింది. తద్వారా రిజర్వేషన్ల లబ్ధి లభించని ఎస్సీ, ఎస్టీ కులాల్లోని నిరుపేదలకు ప్రయోజనం దక్కుతుందని తెలిపింది. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ పరిమితిని వర్తింపజేయాలని పేర్కొంది. 

దీనిపై విచారణకు ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డేకు నివేదించింది.

ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణ కోసం పంజాబ్‌ ప్రభుత్వం గతంలో చట్టాలను చేయగా రాష్ట్రప్రభుత్వాలకు ఈ అధికారం లేదంటూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు వాటిని కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌లు ఇందిరా బెనర్జీ, వినీత్‌ శరణ్‌, ఎంఆర్‌ షా, అనిరుద్ధ బోస్‌ కూడా ఉన్నారు.

2004లో ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నదని ఈ ధర్మాసనం పేర్కొంది. ‘రిజర్వేషన్ల ఫలాలు లభించని ఎస్సీ, ఎస్టీల్లోని అత్యంత నిరుపేదలకు సముచిత కోటాను కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది.

ఓబీసీలలో ఉన్నట్లుగానే ఎస్సీ, ఎస్టీల్లోనూ వర్గీకరణ అవసరమన్నదానిపై పరిశీలన జరుపాలి. ఉపవర్గీకరణను నిరాకరించటం అంటే సమానత్వపు హక్కును నిరాకరించటమే. దీనిని సరిచేయటానికి రాష్ట్రప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేమని స్పష్టంచేసింది.

`అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి రిజర్వేషన్లు అనేవి ఒక ప్రభావవంతమైన మార్గం. అయితే, రిజర్వేషన్ల లబ్ధి పేదల్లోకెల్లా పేదలకు చేరటం లేదు కాబట్టి, (ఓబీసీలకు వర్తింపజేసినట్లుగానే) ఎస్సీ, ఎస్టీల్లోని సంపన్న వర్గాల ప్రజలను రిజర్వేషన్‌ కోటా నుంచి మినహాయించేందుకు క్రీమీ లేయర్‌ విధానాన్ని తీసుకురావాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 78 పేజీల తీర్పును వెలువరించింది.