జీఎస్‌టీ పరిహారంపై రాష్ట్రాలకు రెండు ఆప్షన్లు   

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారం కోసం రాష్ట్రాలకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించే అవకాశాలు కనిపిస్తున్న సమయంలో, రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేసేందుకు ఈ ఆప్షన్లను ప్రకటించింది.

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్ 41వ సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. 

జీఎస్‌టీ ఆదాయ లోటు రూ.2.35 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రాలు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి రెండు ఆప్షన్లను ప్రతిపాదించింది. దీనిని రాష్ట్రాలు పరిశీలించేందుకు 7 పని దినాల గడువు ఇచ్చింది. భగవంతుడి చర్య వంటి అసాధారణ పరిస్థితి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించే అవకాశం ఉందని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. 

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన నష్టం రూ.3 లక్షల కోట్లు, దీనిలో రూ.65,000 కోట్లు జీఎస్‌టీలో విధించే సుంకం నుంచి వస్తుందని అంచనా. కాబట్టి మొత్తం లోటు రూ.2.35 లక్షల కోట్లు. దీనినే రాష్ట్రాలకు భర్తీ చేయవలసి ఉంటుంది. 

మొత్తం రూ.2.35 లక్షల కోట్లలో రూ.97,000 కోట్లు జీఎస్‌టీ లోటు అని, మిగిలినది కోవిడ్-19 మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావమని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే చెప్పారు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)తో సంప్రదించి, రాష్ట్రాలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. 

రూ.97,000 కోట్లు సమంజసమైన వడ్డీ రేటుపై అప్పు తీసుకోవడానికి రాష్ట్రాలకు సాయపడతామని పేర్కొన్నారు. ఈ సొమ్మును ఐదేళ్ళ తర్వాత తిరిగి చెల్లించాలని సూచించారు. ఇది రాష్ట్రాలకు ప్రతిపాదించిన మొదటి ఆప్షన్ అని చెప్పారు. 

రెండో ఆప్షన్ ప్రకారం, మొత్తం రూ.2.35 లక్షల కోట్లను రుణంగా తీసుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ రెండు ఆప్షన్లపై ఆలోచించి, తమ నిర్ణయం తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 7 పని దినాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు.