పుల్వామా దాడిలో పాక్ కుట్రను చేధించిన ఎఫ్‌బీఐ

గత ఏడాది జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ కుట్రని ఛేదించడానికి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ భారత్ కు ఎంతగానో సహకరించింది. ఎన్ఐఏ పోలీసులు దాఖలు చేసిన 1300 పేజీల చార్జ్‌షీట్ లో ఆ విషయం వెల్లడైనది.

చనిపోయిన ఒక మహిళా పేరుతో సిమ్ కార్డు తీసుకొని, దాని ద్వారా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు ఒక వార్తాసంస్థకు దాడి గురించిన సమాచారం ఇవ్వడం ఆధారంగా  ఎఫ్‌బీఐ  పాక్ కుట్రను బహిర్గతం చేసింది. 

ఈ కేసు విచార‌ణ‌లో ఓ వాట్సాప్ నెంబ‌ర్ కీల‌కంగా మారిన‌ట్లు ఎన్ఐఏ చెప్పింది. బుద్గాంకు చెందిన ఓ మ‌హిళ వాట్సాప్ నెంబ‌ర్ నుంచి దాడి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే ఓ వార్త‌సంస్థ‌కు సందేశం వ‌చ్చింది. వాస్త‌వానికి ఆ మ‌హిళ దాడి క‌న్నా ముందే చ‌నిపోయింది. కానీ ఆమె నెంబ‌ర్‌ను ఉగ్ర‌వాదులు వాడిన‌ట్లు ఎన్ఐఏ పోలీసులు గుర్తించారు. 

కానీ ఆ వాట్సాప్ లింకులు బ‌య‌ట‌ప‌డ్డ‌ది మాత్రం అమెరికా వ‌ల్లే అని తేలింది. ఎందుకంటే వాట్సాప్ స‌ర్వ‌ర్ల‌న్నీ అమెరికాలోనే ఉంటాయి.  దాడి క‌న్నా ముందే చ‌నిపోయిన మ‌హిళ ఐడీ కార్డు, ఫోటోతో పాకిస్థాన్‌లోని జైషే ఉగ్ర‌వాదులు సిమ్ తీసుకున్నారు. ఆ నెంబ‌ర్‌తో వాట్సాప్ చాట్ చేశారు.  పుల్వామా దాడికి సంబంధించి ప్లాన్ వేసిన‌ట్లు ఈ విచార‌ణ‌లో తేలింది.

పాక్‌లోని ముజాఫ‌రాబాద్ నుంచి ఆ సిమ్‌ను ఆప‌రేట్ చేసిన‌ట్లు విచార‌ణాధికారులు గుర్తించారు. ఇక పుల్వామా దాడి త‌ర్వాత జ‌రిగిన ఓ ఎన్‌కౌంట‌ర్‌లో ఉమ‌ర్ ఫారూక్ అనే ఉగ్ర‌వాది హ‌తం అయ్యాడు. అత‌ని ఫోన్‌ను కూడా ఎన్ఐఏ అధికారులు ట్రేస్ చేశారు. కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఫోన్‌ను డీకోడ్ చేసి అనేక ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఉమ‌ర్ ఫారూక్ ఫోన్‌, బుద్గాం మ‌హిళ నెంబ‌ర్‌తో ఉన్న సిమ్‌ను విశ్లేషించిన ఎన్ఐఏ పోలీసులు పుల్వామా దాడిలో పాక్ హ‌స్త‌మున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. పాకిస్థాన్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఉగ్ర‌వాది ఫారూక్‌కు కొంత న‌గ‌దు బదిలీ అయ్యింది. ఆ కోణంలో పాక్‌కు ఎన్ఐఏ పోలీసులు లేఖ రాయ‌నున్నారు.

 జైషే మహమ్మద్ సంస్థ, పుల్వామా ఎటాక్ మాస్టర్ మైండ్ మహమ్మద్ ఉమర్ ఫరూఖ్ ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా  చార్జ్‌షీట్ లో  పేర్కొన్నారు. అందులో పేర్కొంది. గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య పాకిస్తాన్ నుంచి రూ.10 లక్షలు ఐదు వాయిదాలలో వచ్చినట్లు వివరించారు.

ఉమర్ ఫరూఖ్ కు చెందిన అల్లయిడ్ బ్యాంక్, మీజాన్ బ్యాంక్ అకౌంట్లలో ఆ డబ్బు డిపాజిట్ అయినట్లు తెలిపారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు హవాలా మార్గంలో డబ్బు ఎక్స్ చేంజ్ జరిగినట్లుగా  అనుమానిస్తున్నారు.