రామగుండం ప్లాంట్ లో నవంబర్ నుండి ఉత్పత్తి 

రామగుండం ప్లాంట్ లో నవంబర్ నుండి ఉత్పత్తి 

రామగుండంలో నిర్మాణంలో ఉన్న రామగుండం ఫెర్టిలైజర్& కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కిసాన్ బ్రాండ్ యూరియా ” పేరుతో నవంబర్ 15, 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష  నిర్వహించారు. 

రామగుండం ప్లాంట్ కు సంబంధించి మొత్తం 460 మంది పర్మనెంట్ ఉద్యోగులగాను ఇప్పటికే 278 మంది ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశామని మరి కొంతమందిని త్వరలోనే భర్తీ చేస్తామని, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తుందని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 
ప్లాంటు భద్రతకు సంబంధించి, సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని  అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానిపై సత్వరమే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో సుమారు రూ 55 కోట్లు సమకూర్చాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 
 
త్వరలో కేంద్ర మంత్రి సదానంద గౌడతో  సమీక్షా సమావేశం నిర్వహించి సెప్టెంబర్ చివరి వారంలో రామగుండం ప్లాంటును సందర్శిస్తాననీ మంత్రి అధికారులకు తెలిపారు.  అలాగే రామగుండం ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే యూరియాని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడా కేటాయింపులు చేయాలని మంత్రి కోరారు.
ప్రస్తుత కోటా ప్రకారం రామగుండం కర్మాగారం ద్వారా సుమారు 50 శాతం  ఎరువులు మాత్రమే తెలంగాణాకి కేటాయించి మిగతా ఇతర రాష్ట్రాలకి సరఫరా అవుతుందని  తెలంగాణాకి సంబంధించి తక్కిన అవసరాల నిమిత్తం పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న విషయం మంత్రి   దృష్టికి వచ్చింది.
దీని విషయంలో ఎక్కడి ఉత్పత్తి అయిన ఎరువులు అక్కడి అవసరాలకు అనుగుణంగా వాడితే ఇతర రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉందని  ఈ విషయం పై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అలానే స్థానికులకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
 
ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ కార్యనిర్వాహక సంచాలకులు రాజన్ థాపర్, జనరల్ మేనేజర్ వి. కె. బంగార్ లతో  పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  అదనపు ప్రైవేట్ కార్యదర్శి  శశికిరణాచారి పాల్గొన్నారు.