భారత్ – చైనాల మధ్య 1962 తర్వాత క్లిష్ట స్థితి 

తూర్పు ల‌డ‌ఖ్‌లో చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు అంశం  1962 త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డ్డ అత్యంత క్లిష్ట ప‌రిస్థితి అని   దేశాంగ మంత్రి డాక్ట‌ర్ ఎస్ జైశంక‌ర్  పేర్కొన్నారు.  1962లో రెండు దేశాల మ‌ధ్య జ‌రిగిన యుద్ధాన్ని ప్ర‌స్తావిస్తూ 45 ఏళ్ల త‌ర్వాత చైనాతో స‌రిహ‌ద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని విచారం వ్యక్తం చేశారు. 

రెండు దేశాలు స‌రిహ‌ద్దు వ‌ద్ద మోహ‌రించిన సంఖ్య కూడా అసాధార‌ణంగా ఉన్న‌ట్లు జైశంక‌ర్ ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపారు. జూన్ 15వ తేదీన గాల్వ‌న్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయారు. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రిగాయి.  కానీ ఆ చ‌ర్చ‌ల్లో మాత్రం ఇంకా ప్ర‌తిష్టంభ‌న నెల‌కొని ఉన్న‌ది. 

పొరుగు దేశాల‌తో సంబంధాలు బాగుండాలంటే, స‌రిహ‌ద్దుల్లో శాంతి, సామ‌రస్యం అవ‌స‌ర‌మ‌ని చైనాకు స్ప‌ష్టం చేసిన‌ట్లు మంత్రి జైశంక‌ర్ తెలిపారు. గ‌త మూడు ద‌శాబ్ధాల‌ను ప‌రిశీలిస్తే, గ‌త మూడున్న‌ర నెల‌ల నుంచి తూర్పు ల‌డ‌ఖ్‌లో రెండు దేశాల సైనికులు ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు.  

సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఉద్రిక్తలు మాత్రం త‌గ్గ‌లేద‌ని పేర్కొన్నారు. గ‌తంలో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు దౌత్య‌ప‌రంగా ప‌రిష్కారం అయిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. దీప్‌సాంగ్‌, చుమార్‌, డోక్లామ్ స‌మ‌స్య‌లు అలాగే పరిష్కారం అయిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న అన్ని ఒప్పందాల‌ను గౌర‌విస్తూనే రెండు దేశాల మ‌ధ్య స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెత‌కాల‌ని సూచించారు. 

ఇలా ఉండగా, భారత సైన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. చైనాతో యుద్ధం ఎప్పుడు జరిగినా పాక్ కల్పించుకుని తీరుతుందని ఆయన తేల్చి చెప్పారు. ‘నా మాటలను గుర్తుంచుకోండి.. చైనాతో యుద్ధం అంటూ వస్తే పాక్ కూడా కల్పించుకుంటుంది. రెండు దేశాలు కుమ్మక్కువతాయి’ అని ఆయన స్పష్టం చేశారు. 

ఇక లడఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంగురించి ప్రస్తావిస్తూ ‘మునపటి కంటే దేశం పరిస్థితి ఎంతో మెరుగైంది. మనపై దాడి చేయగలమని చైనా భావిస్తే.. అది మూర్ఖత్వమే అవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.