ఈ-సంజీవని ద్వారా టెలి-కన్సల్టేషన్ సేవలు 

ఈ-సంజీవని ద్వారా టెలి-కన్సల్టేషన్ సేవలు 

ప్రస్తుతం కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యులతో టెలి-కన్సల్టేషన్ సేవలను ప్రారంభించాలని సీనియర్ సిటిజన్ లబ్ధిదారులతో సహా వివిధ వర్గాల నుంచి ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ప‌లు అభ్యర్థనలు అందుతున్నాయి. 

కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో సీనియర్ సిటిజన్లు బహిరంగ ప్రదేశాల‌ను, మ‌రీ ముఖ్యంగా ప్ర‌జా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల‌ను సందర్శించడం సుర‌క్షితం కాని కార‌ణంగా టెలి-కన్సల్టేషన్ వైద్య సేవలను ప్రారంభించాలన్న విజ్ఞ‌ప్తులు అందుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలో సీజీహెచ్ఎస్ లబ్ధిదారులు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని భౌతికంగా సందర్శించకుండానే.. వర్చువల్ విధానంలో వైద్య నిపుణులతో ఆరోగ్య సంబంధితమైన సంప్రదింపులు జరిపేందుకు వీలుగా సీజీహెచ్ఎస్ టెలి-కన్సల్టేషన్ సేవలను ప్రారంభించింది.

ఆగ‌స్టు  25 వ తేదీ నుంచి ఈ  సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ముందుగా ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ల‌లోని లబ్ధిదారులకు మాత్ర‌మే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని పని దినాల‌లో ఉదయం 9 గంట‌ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు ఈ-సేవలు అందుబాటులో ఉంటాయి. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన‌ ఈ-సంజీవని వేదిక‌ను సీజీహెచ్ఎస్ టెలి-కన్సల్టేషన్ సేవల కోసం ఉప‌యోగిస్తున్నది. వాడుకపు సౌలభ్యానికి గాను ఈ వేదిక‌ను లబ్ధిదారుల ఐడీతో అనుసంధానించారు. స్పెషలిస్ట్, ఓపీడీ సేవల‌ను పొందటానికి గాను లబ్ధిదారులు వారి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలి. 

ఆ తర్వాత ధ్రువీకరణ ప్రయోజనాల కోసం ఒక వ‌న్‌టైమ్ పాస్‌వార్డ్ జారీ చేయ‌డ‌మ‌వుతుంది. త‌గిన ధ్రువీక‌ర‌ణ త‌రువాత లబ్ధిదారులు సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. రోగి త‌న రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపవచ్చు, టోకెన్ కోసం అభ్యర్థించవచ్చు.

‌తన ఆరోగ్య రికార్డులను కూడా  అవసరమైతే అప్‌లోడ్ చేయవచ్చు. రోగుల‌కు ఎస్ఎంఎస్‌ ద్వారా ఐడీ ,టోకెన్ నంబ‌రును పంపుతారు. ఆన్‌లైన్ క్యూలో వారి సంఖ్య గురించి కూడా తెలియజేస్తారు. రోగి క్యూ వ‌చ్చిన‌ప్పుడు ‘ఇప్పుడు కాల్ చేయండి’ బటన్  యాక్టివేట్ అవుతుంది. 

దీనిని ఉపయోగించి, సంబంధిత లబ్ధిదారుడు సంప్రదింపుల కోసం వైద్య నిపుణుడితో వీడియోకాల్‌ను మొద‌లు పెట్ట‌వ‌చ్చు. కోవిడ్ -19 వ్యాప్తి కాలంలో బయటకు వెళ్ళలేకపోతున్న సీజీహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ టెలి-కన్సల్టేషన్ వైద్య‌ సేవలు ఒక వరంగా మారాయి. ఈ వేదిక‌పై వైద్య నిపుణుల సంప్రదింపులు అందుబాటులో ఉంచారు.