రాజధాని రైతులపై ప్రభుత్వ తీరు గర్హనీయం 

నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని గా అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం తీరు గర్హనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ సకాలంలో వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
రూ.28 వేల మందికి పైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఆర్డీఏ రైతులతో చేసుకొన్న ఒప్పందం ఎకరాకీ ప్రతి  ఏటా రూ.3 వేలు మెట్టకి, రూ.5 వేలు పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిని కోరారు.  
 
 భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిందని వీర్రాజు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయని అందువలన రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. 
 
న్యాయం కోసం వచ్చిన వారిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 21న కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ జమ కాలేదని ధ్వజమెత్తారు. 

ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని ఆయన మండిపడ్డారు. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వెళ్ళిన రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించాహరు. భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి సత్వరమే పరిష్కార మార్గం చూడాలని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.