ధోనీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం 

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మహీ నవ భారతానికి ప్రతిరూపమని మోదీ కితాబిచ్చారు. ఇటీవలే అందరినీ ఆశ్చర్యంలో పడే స్తూ 16 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు మహీ వీడ్కోలు పలికాడు. మహి భవిష్యత్తు ఆనందంగా సాగాలంటూ విభిన్న వర్గాలనుంచి ఆకాంక్షలు వెల్లు వెత్తాయి. 

మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచం మెచ్చే క్రికెటర్‌గా ఎదిగిన ధోనీని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ రెండు పేజీల లేఖ రాశారు. హృదయానికి హత్తుకునేలా మోదీ ఎంతో భావాత్మకంగా రాసుకొచ్చారు. దీనిపై ధోనీ స్పందిస్తూ ట్విట్టర్‌లో మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు.  

ఆగస్టు 15వ తేదీన ఓ చక్కని హిందీ సినిమా పాటతో కెరీర్‌కు నీదైన శైలిలో వీడ్కోలు పలికావు. 130 కోట్ల మంది భారతీయులను రిటైర్మెంట్‌ నిర్ణయంతో నువ్వు నిరాశపరిచినా..దేశ క్రికెట్‌కు దశాబ్దానికిపైగా నువ్వు నిరుపమాన సేవలు అందించావు. అత్యుత్తమ నాయకునిగా టీమ్‌ఇండియాను ప్రపంచంలోనే టాప్‌లో నిలిపావు. బ్యాట్స్‌మన్‌గానే కాదు గొప్ప కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా చరిత్రకెక్కావు. 2011 ప్రపంచకప్‌ను సిక్స్‌తో పూర్తి చేసిన సందర్భం చిరకాలం నిలిచిపోతుందని తన లేఖలో  ప్రధాని కొనియాడారు. 

ఒక క్రీడాకారునిగా మాత్రమే నిన్ను చూడటం అన్యాయమే అవుతుంది. క్రికెటర్‌గా నువ్వు కోట్లాది మందిపై చూపించిన ప్రభావం అద్భుతం. ఒక చిన్న పట్టణం, మధ్య తరగతి కుటుంబం నుంచి దేశం గర్వించే స్థాయికి ఎదిగావు. అణకువగా ఉంటూ అనతికాలంలోనే కోట్లమంది కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు. నవభారతానికి నువ్వు ప్రతిరూపం. ఎలాంటి కుటుంబం నుంచి వచ్చామన్నది కాకుండా ఎంత ఎదిగాం అన్నదే ముఖ్యం. ఈ స్ఫూర్తిని రగిలించి యువతకు మార్గదర్శకమయ్యావని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. 

మైదానంలో నీ సాహసోపేత నిర్ణయాలు ప్రస్తుత తరం శైలికి అద్దం పడుతాయి. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా రిస్క్‌ తీసుకునేందుకు నేటి యువతరం వెనుకాడబోదు. చాలా సందర్భాల్లో నువ్వు అది చేతల్లో చూపించావు. 2007 పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సరైన ఉదాహరణ. నువ్వు ఎన్ని రకాల హెయిర్‌ స్టెల్స్‌తో ఆకట్టుకున్నావన్నది కాదు. గెలుపు, ఓటముల్లో నువ్వు చూపిన తెగువ యువతకు ముఖ్యమైన పాఠం అంటూ ప్రధాని వివరించారు. 

ఆర్మీ తో నీకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆర్మీలో నువ్వు భాగం కావడం బాగుంది. సైనికుల సంక్షేమంపై చూపించే చొరవ మాటలకందనిదని అంటూ ప్రధాని ప్రశంసించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలుతో ఇక నుంచి భార్య సాక్షి, కూతురు జివాతో మరిం త సమయం గడిపే అవకాశం లభిస్తుందని ప్రధాని తెలిపారు. 

ఒక టోర్నీలో నీ సహచరులంతా సంబురాల్లో మునిగితే..నువ్వు మాత్రం కూతురుతో సరదాగా ఆడుకున్న సందర్భం నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. అది అద్భుతమైన దృశ్యం  ధోనీ. భవిష్యత్తులో నీకు అంతా మేలు జరుగాలని ఆశిస్తున్నానని ఆ లేఖలో మోదీ వివరించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను ఎంఎస్‌ ధోని తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఒక కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు ప్రశంసలను కోరుకుంటాడు. వారి కృషి, త్యాగం అందరిచేత గుర్తించబడి, ప్రశంసించబడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ .. మీ ప్రశంసలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని మహీ ట్వీట్‌ చేశారు.