తమిళనాడులో రెండో రాజధాని వివాదం 

శాసనసభ ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో ఉన్న తరుణంలో తమిళనాడులోని పళినిస్వామి సర్కార్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రానికి రెండో రాజధాని కావాలంటూ అధికార పార్టీ నేతలే వీధులుకెక్కారు.
కొంతమంది మధురైని రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం మంత్రులు ఉదరుకుమార్‌, సెల్లూర్‌ రాజ్‌లు తీర్మానాలు కూడా చేశారు. మరికొంతమంది మధురైని వ్యతిరేకిస్తున్నారు. మధురైన మంచినీటి సమస్య ఉన్నందున అక్కడ రెండో రాజధాని వద్దని అంటున్నారు.
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న నినాదాన్ని రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ అందుకోగా  ఇందుకు మరో మంత్రి సెల్లూరు కె రాజు మద్దతు ప్రకటించారు. దక్షిణ తమిళనాడులో మదురైకు సమీపంలో ఉన్న జిల్లాల్లోనూ రెండో రాజధాని నినాదం మిన్నంటుతోంది.
మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ తన నినాదాన్ని సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఉన్న ఓటు బ్యాంక్‌ను గురిపెట్టి మదురైను రెండో రాజధానిగా ప్రకటించవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.
ఇది కాస్త తిరుచ్చి జిల్లాకు చెందిన మంత్రి వెల్లమండి నటరాజన్‌ను కలవరంలో పడేసినట్టుంది. మదురై కన్నా, తిరుచ్చి అన్నింటికీ మిన్న నినాదాన్ని అందుకునేలో పడ్డారు. దివంగత నేత ఎంజీఆర్‌ గతంలో తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశారని, అయితే, పరిస్థితుల ప్రభావంతో అది అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం తిరుచ్చి పేరును సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తిరుచ్చి నినాదానికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఆపార్టీ ఎంపీ తిరునావుక్కరసర్‌ మీడియాతో మాట్లాడుతూ, రెండో రాజధానికి  తిరుచ్చి అనుకూలమనిపేర్కొన్నారు. ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
 
పార్టీలోని నేతలు రెండు గ్రూపులుగా చీలి ఒకరికి వ్యతరేకంగా మరోకరు విమర్శలు చేస్తుండడం పళిని సర్కారుకు తలనొప్పిగా మారింది. మరోవైపు ఈ డిమాండ్లు పెద్ద డ్రామా అని ప్రతిపక్ష పార్టీ డిఎంకే అంటోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని డిఎంకే ఆరోపిస్తోంది.