లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్ మాసంలో బిర్యానీలు, కాజు పిస్తాలు అందించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం గణేష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించకుండా కఠిన కుట్రలు చేస్తోందని, ఆంక్షలు అడ్డంకులు సృష్టిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడంకెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న బండి సంజయ్ యావత్ తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. సంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించడం హిందూ సమాజానికి సహజమైన అలవాటని గుర్తు చేశారు.
ఈ సహజ ప్రక్రియను అడ్డుకుంటే ఇబ్బందులు కలిగిస్తే హిందూ సమాజం రాజకీయ నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తోందని హెచ్చరించారు. బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గణేశ్ ఉత్సవాలపై అడ్డంకులు సృష్టిస్తూ, నిర్వాహకులపై పోలీసులతో కేసీఆర్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
లోపాయికారి అవగాహనతో కలిసి కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని సంజయ్ వెల్లడించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం మన బాధ్యత అని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ధార్మిక సంస్థలు,హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపిచ్చారు.
More Stories
స్కామ్‌లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది