శశి థరూర్‌ పై బిజెపి ఎంపీల ఫిర్యాదు 

ఫేస్‌బుక్‌ వివాదానికి సంబంధించి కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్  ట్వీట్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా దిగ్గజం నుంచి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ వివరణ కోరనుందని, ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్‌ తమతో చర్చించకముందే ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేశారని, బహిరంగ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. 
 
శశి ధరూర్‌ నిబంధనల ఉల్లంఘనపై తాను స్పీకర్‌కు లేఖ రాశానని, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ వెల్లడించారు. ఏ సంస్ధ ప్రతినిధినైనా పిలిపించి మాట్లాడేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆయన (శశి థరూర్‌) తమతో చర్చించకుండా మీడియాతో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత్‌లో ఫేస్‌బుక్‌ బీజేపీకి వత్తాసు పలుకుతూ తమ వేదికపై కాషాయ నేతలు విద్వేష ప్రసంగం, సందేశాలు పోస్ట్‌ చేసేందుకు అనుమతిస్తోందన్న వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
కాగా, ఫేస్‌బుక్‌ను తమ కమిటీ ఎదుట హాజరు కావాలని ఐటీ స్టాండింగ్‌ కమిటీ చీఫ్‌ శశి థరూర్‌ సమన్లు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే థరూర్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. పార్లమెంటరీ విధానాలు, పద్ధతులు పాటించకుండా శశి థరూర్‌ ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపారని దూబే ఆరోపించారు.