ఇనుము లేకుండా రాగితోనే అయోధ్య రామాలయం

అసలు ఇనుము వాడకుండా కేవలం రాగి, రాళ్లతోనే అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నట్లు శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్రధాన కార్యదర్శి చంప‌త్ రాయ్‌ వెల్లడించారు. ఈ నెల 5న రామాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ జరిపిన తర్వాత ట్రస్ట్ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది.
 
 హిందూ భ‌క్తులు ఆల‌య నిర్మాణం కోసం రాగిని విరాళం ఇవ్వాలంటూ ఆయ‌న కోరారు. 1990లో శిల‌ల‌ను దానం చేసిన‌ట్లుగానే దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులంతా రాగి వైర్లు కానీ, రాడ్లు కానీ దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. క‌నీసం వెయ్యేళ్లు చెక్కుచెద‌ర‌కుండా ఉండే విధంగా ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
భ‌క్తులు ఇచ్చిన రాగితో అయోధ్య ఆల‌య‌ నాణ్య‌త మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. నిర్మాణం కోసం రాగి రాడ్లు అవ‌స‌ర‌మ‌ని, కనీసం ప‌ది వేల రాడ్లు అవ‌స‌రం ఉంటుంద‌ని పేర్కొన్నారు. నిర్మాణం కోసం కేవ‌లం రాళ్లను వాడ‌నున్న‌ట్లు చెప్పారు. 
 
ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ది. భూప‌రీక్ష కోసం ఐఐటీ చెన్నై ఇంజినీర్ల‌ను పిలిపించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. భూకంపాల నుంచి ఆల‌యాన్ని ర‌క్షించుకునే విధంగా ఉండేందుకు సెంట్ర‌ల్ బిల్డింగ్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు ప‌నిచేయ‌నున్న‌ట్లు చంప‌త్ రాయ్ తెలిపారు.
 
 అయోధ్య రామాల‌య నిర్మాణం కోసం క‌నీసం 36 నుంచి 40 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతూ ముస్లింలు కూడా ఆల‌య నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వ‌వొచ్చని ఆహ్వానం పలికారు.
 
 ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ  రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్‌ చేసింది  .